Ayurveda: వేపలో అన్నీ ఔషధ గుణాలే.. అంటోన్న ఆయుర్వేదం!
- వేప చెట్టులో అన్ని భాగాల్లోనూ ఔషధాల రసాయనాలు
- ఏ రూపంలో తీసుకున్నా మంచి ఫలితాలు
- గర్భిణులు, చిన్నారులకు వేప ఇవ్వకూడదు
- సంతానం కోరుకునే వారు కూడా దూరంగా ఉండాల్సిందే
వేప చెట్టులో వృథాగా పోయేదేమీ ఉండదు. వేప ఆకులు, వేప కాయలు, వేప గింజలు వేప పూత, వేప బెరడు.. ఇలా అన్నీ కూడా మంచి ఔషధ గుణాలు కలిగినవే. వేపతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలను ఆయుర్వేదం ప్రత్యేకంగా చెప్పింది. వేప పుల్లతో దంత ధావనం పల్లెవాసుల పంటి ఆరోగ్య రహస్యాల్లో ఒకటి. పంటలకు సహజ కీటకనాశినిగా వేప మేలు చేస్తోంది.
వేపతో కలిగే ప్రయోజనాలు
వేపలో ఉండే రసాయనాలు బ్లడ్ గ్లూకోజు, అల్సర్లను తగ్గిస్తాయని, బ్యాక్టీరియాను చంపేస్తాయని ఆయుర్వేద వైద్యులు చెబుతారు. చర్మవ్యాధులకు సైతం వేప మంచి ఔషధంగా పనిచేస్తుంది. జీర్ణశక్తి మెరుగుపడేందుకు, అలసట తగ్గించేందుకు, దగ్గు, దాహాన్ని తగ్గించేందుకు, గాయాలు మానేందుకు, వాపు తగ్గించేందుకు వేప సాయపడుతుంది.
- బయటి నుంచి వాడకం..
వేప పౌడర్ ను నీటితో కలిపి పేస్ట్ లా చేసిగానీ, లేదంటే తేనెతో కలిపిగానీ గాయంపై రాయాలి. - వేప పౌడర్ లేదా వేప ఆకులను గోరువెచ్చని నీటిలో కలిపి స్నానం చేయాలి.
- చుండ్రు సమస్యతో బాధపడుతున్న వారు వారానికి ఒక్కసారి అయినా తలకు వేప పౌడర్ ను పట్టించి స్నానం చేస్తే ఫలితం కనిపిస్తుంది.
- వేప ఆకులతో డికాషన్ చేసుకుని తాగడం వల్ల ఇన్ఫెక్షన్ తగ్గుతుంది. ఇది బ్యాక్టీరియాను చంపేస్తుంది.
- మొటిమల సమస్యలతో బాధపడుతున్న వారు వేప పౌడర్ ను చందనం, రోజ్ వాటర్ తో కలిపి రాసుకోవడం వల్ల మంచి ఫలితం కనిపిస్తుంది.
లోపలికి తీసుకోవడం..
రోజూ 7-8 ఆకులను రెండు వారాలు నమిలి తినడంగానీ లేదా రోజూ ఒకటి రెండు నీమ్ టాబ్లెట్లను గానీ నెల రోజుల పాటు తీసుకోవచ్చు. లేదంటే రోజూ 10-15 ఎంఎల్ నీమ్ జ్యూస్ ను రెండు, మూడు వారాల పాటు తీసుకోవడం చేయాలి. ఇలా వేపను ఏ రూపంలో తీసుకున్నా శరీరంలోని హానికారక వ్యర్థాలు బయటకు పోతాయని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు. కానీ, గర్భిణీలు, శిశువులు, చిన్న పిల్లలు, సంతానం కోసం ప్రయత్నం చేస్తున్న స్త్రీ, పురుషులు వేప ఉత్పత్తులను తీసుకోకూడదు.