TS Film Chamber Of Commerce: లోబడ్జెట్‌కు 4 వారాలు, భారీ బడ్జెట్‌కు 10వారాలు... ఓటీటీ రిలీజ్‌పై టాలీవుడ్ మార్గదర్శకాలు
- రూ.6 కోట్ల లోపు సినిమాలన్నీ లోబడ్జెట్ సినిమాలు
- రూ.6 కోట్లు మించినవన్నీ భారీ బడ్జెట్ సినిమాలే
- సినిమా టికెట్ల ధరలనూ నిర్ణయించిన ఫిలిం చాంబర్
తెలుగు సినిమాలు థియేటర్లలో రిలీజ్ అయ్యాక ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చే విషయంపై తెలంగాణ స్టేట్ ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ సోమవారం ఓ స్పష్టమైన విధానాన్ని ప్రకటించింది. ఈ మేరకు సోమవారం హైదరాబాద్‌లో భేటీ అయిన ఫిలిం చాంబర్ కొత్త విధానాన్ని ప్రకటించింది. అన్నిరకాల సినిమాలకు ఈ విషయంలో ఒకే తరహా నిబంధనలు సరికాదని భావించిన సమావేశం.. లో బడ్జెట్ సినిమాలకు ఒక రకమైన, భారీ బడ్జెట్ సినిమాలకు మరో రకమైన నిబంధనలను నిర్దేశించింది.
రూ.6 కోట్ల లోపు బడ్జెట్‌తో రూపొందే సినిమాలను లో బడ్జెట్ సినిమాలుగా పరిగణించిన సమావేశం... ఈ సినిమాలు థియేటర్లలో రిలీజ్ అయిన తర్వాత కనీసం 4 వారాల తర్వాతే ఓటీటీలో విడుదలకు అవకాశం కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. రూ.6 కోట్లకు పైబడి బడ్జెట్‌తో రూపొందే సినిమాలను భారీ బడ్జెట్ సినిమాలుగా పరిగణించిన సమావేశం... ఈ తరహా సినిమాలు థియేటర్లలో రిలీజ్ అయ్యాక కనీసం 10 వారాల పాటు ఓటీటీలో విడుదలకు అనుమతి ఇవ్వకూడదని నిర్ణయించింది. ఇదిలా ఉంటే... తెలంగాణలో సినిమా టికెట్ల ధరలపైనా ఫిలిం చాంబర్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.