Telangana: కేసీఆర్ భవిష్యత్తు రాజకీయ వ్యూహాలపై గవర్నర్ తమిళిసై సంచలన వ్యాఖ్యలు
- ముందస్తు ఎన్నికలకు కేసీఆర్ వెళ్లకపోవచ్చన్న తమిళిసై
- జాతీయ రాజకీయాల్లోకి రావాలనేదే కేసీఆర్ లక్ష్యమన్న గవర్నర్
- అందుకే ప్రధాని మోదీపై కేసీఆర్ విమర్శలు చేస్తున్నారని వ్యాఖ్య
- గవర్నర్‌గా ప్రోటోకాల్‌ను ఆశించడం లేదని వివరణ
టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ సోమవారం రాత్రి ఢిల్లీ పర్యటనకు బయలుదేరుతున్న సంగతి తెలిసిందే. ఇలాంటి కీలక తరుణంలో కేసీఆర్ రాజకీయ భవిష్యత్తు వ్యూహాలపై తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ సోమవారం మధ్యాహ్నం సంచలన వ్యాఖ్యలు చేశారు.
కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లకపోవచ్చని ఆమె వ్యాఖ్యానించారు. కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావాలన్న లక్ష్యంతోనే ప్రధాని నరేంద్ర మోదీని విమర్శిస్తున్నారని కూడా ఆమె అన్నారు. అయితే జాతీయ రాజకీయాల్లోకి కేసీఆర్ ప్రవేశించడం అసాధ్యమని ఆమె అన్నారు.
ఇక తనకు తెలంగాణ ప్రభుత్వంతో కొనసాగుతున్న దూరంపైనా తమిళిసై కీలక వ్యాఖ్యలు చేశారు. తాను గవర్నర్‌గా ప్రోటోకాల్‌ను ఆశించడం లేదని ఆమె వ్యాఖ్యానించారు. సీఎం కేసీఆర్ ఇటీవలే రాజ్ భవన్ కు వచ్చి వెళ్లాక కూడా తన ప్రోటోకాల్‌లో ఎలాంటి మార్పు లేదని ఆమె తెలిపారు. మొన్న భద్రాచలం వెళ్లినా అధికారులు ఎవరూ రాలేదని ఆమె అన్నారు. ఇతర రాష్ట్రాల గవర్నర్లు, వారికి దక్కుతున్న ప్రోటోకాల్‌తో తనను పోల్చుకోనని కూడా ఆమె తెలిపారు. ప్రజలకు దగ్గరగా ఉండటమే తన నైజమని తమిళిసై వ్యాఖ్యానించారు.