TSRTC: ఏపీఎస్సార్టీసీ, టీఎస్సార్టీసీ ఎండీల భేటీ.. అంతర్రాష్ట్ర రవాణా ఒప్పందాలపై చర్చలు
- రాష్ట్ర విభజనతో విడిపోయిన ఆర్టీసీ
- రెండు రాష్ట్రాల్లో ఆర్టీసీ బస్సుల సేవలపై ఒప్పందం
- బస్ భవన్ కేంద్రంగా జరుగుతున్న చర్చలు
తెలుగు రాష్ట్రాల మధ్య రవాణా ఒప్పందాలపై చర్చించేందుకు సోమవారం రెండు రాష్ట్రాలకు చెందిన ఆర్టీసీ ఎండీలు వీసీ సజ్జన్నార్ (టీఎస్సార్టీసీ), తిరుమల రావు (ఏపీఎస్సార్టీసీ)లు భేటీ అయ్యారు. హైదరాబాద్‌లోని బస్ భవన్ కేంద్రంగా జరుగుతున్న ఈ చర్చల్లో ఇరు రాష్ట్రాల మధ్య కుదిరిన రవాణా ఒప్పందాలపై చర్చలు జరుగుతున్నట్లుగా సమాచారం. 8 ఏళ్ల క్రితం దాకా ఒకే రాష్ట్రంగా సాగిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్...2014లో రెండు రాష్ట్రాలుగా విడిపోవడంతో... ఆర్టీసీ కూడా రెండు విభాగాలుగా మారిపోయింది.
ఈ క్రమంలో ఇరు రాష్ట్రాలు తమ తమ ఆర్టీసీలను ఆర్థికంగా కాపాడుకోవడంతో పాటుగా ఆయా సంస్థలను నష్టాల బాట నుంచి గట్టెక్కించేందుకు చర్యలు చేపట్టాయి. అందులో భాగంగా ఒక రాష్ట్ర పరిధిలోని రోడ్లపై మరో రాష్ట్రానికి చెందిన ఆర్టీసీ బస్సుల ప్రయాణంపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఈ వివాదం మరింతగా ముదరకముందే స్పందించిన రెండు రాష్ట్రాలు... ఇరు రాష్ట్రాల్లో రెండు ఆర్టీసీ బస్సులు ఏ మేర తిరగాలన్న దానిపై ఓ అవగాహనకు వచ్చాయి.
దాదాపుగా ఐదేళ్ల క్రితం నాడు కుదిరిన ఒప్పందమే ఇంకా అమలులో ఉంది. తాజాగా మారిన పరిస్థితులు, కరోనా పరిస్థితుల నేపథ్యంలో రెండు ఆర్టీసీలపై పడ్బ భారం నేపథ్యంలో ఈ ఒప్పందాలను మరింతగా సరళీకృతం చేయాలని ఇరు రాష్ట్రాలు భావించాయి. ఒప్పందంలో ఏఏ అంశాలను చేర్చాలి... పాత ఒప్పందంలోని ఏఏ అంశాలను తొలగించాలన్న దానిపై చర్చించేందుకే సజ్జన్నార్, తిరుమలరావులు తాజాగా భేటీ అయ్యారు.