Andhra Pradesh: రేపు కోనసీమ పర్యటనకు ఏపీ సీఎం... వరద ప్రాంతాల్లో జగన్ టూర్ ఇలా..!
- రేపు రాత్రి రాజమహేంద్రవరంలోనే బస చేయనున్న జగన్
- బుధవారం కూడా వరద ప్రాంతాల్లో పర్యటించనున్న సీఎం
- పి.గన్నవరం మండలం పెదపూడి నుంచి జగన్ టూర్ ప్రారంభం
ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంగళవారం వరద ప్రభావిత ప్రాంతాల పరిశీలన, వరద బాధితుల పరామర్శకు వెళ్లనున్నారు. ఈ మేరకు జగన్ కోనసీమ జిల్లా మీదుగా ప్రారంభం కానున్న మంగళవారం నాటి పర్యటనకు సంబంధించిన టూర్ షెడ్యూల్‌ను రాష్ట్ర ప్రభుత్వం సోమవారం విడుదల చేసింది. ఈ పర్యటనలో సీఎం జగన్ వరద బాధితులతో నేరుగా మాట్లాడనున్నారు.
మంగళవారం ఉదయం 10.30 గంటలకు కోనసీమ జిల్లాలోని పి.గన్నవరం మండలం పెదపూడికి జగన్ చేరుకుంటారు. అక్కడికి సమీపంలోని పుచ్చకాయలవారిపేటలో వరద బాధితులతో జగన్ భేటీ అవుతారు. అనంతరం అరిగెలవారిపేటకు చెందిన వరద బాధితులతో సీఎం మాట్లాడనున్నారు. ఆ తర్వాత ఉడిమూడిలంకలో వరద బాధితులతో జగన్ సమావేశం అవుతారు.
తదనంతరం అదే మండల పరిధిలోని వాడ్రేవుపల్లికి మధ్యాహ్నం 2.05 గంటలకు జగన్ చేరుకుంటారు. అక్కడి నుంచి రాజోలు మండలం మేకలపాలెం వెళతారు. ఆ తర్వాత సాయంత్రం 4.05 గంటలకు రాజమహేంద్రవరం చేరుకుంటారు. రాజమహేంద్రవరం గెస్ట్ హౌస్‌లో వరదలపై అధికారులతో సమీక్షిస్తారు. ఈ సమీక్ష అనంతరం మంగళవారం రాత్రి జగన్ రాజమహేంద్రవరంలోనే బస చేస్తారు. బుధవారం కూడా జగన్ వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్నారు.