Water: అవసరానికి మించి మంచి నీళ్లు తాగడమూ మంచిదికాదంటున్న వైద్య నిపుణులు

It is also not good to drink more water than necessary

  • శరీరానికి ఎండాకాలం, వానాకాలం, చలికాలంలో వేర్వేరుగా నీటి అవసరం
  • నీటి శాతం తగ్గితే డీహైడ్రేషన్ సమస్య.. పెరిగితే హైపోనేట్రిమియా ఇబ్బంది
  • అధిక నీటి శాతం కారణంగా కండరాల బలహీనత, వణుకు వంటి సమస్యలు వచ్చే అవకాశం

రోజూ తగిన స్థాయిలో నీళ్లు తాగాలంటూ వైద్యులు, పోషకాహార నిపుణులు సూచిస్తూనే ఉంటారు. ముఖ్యంగా ఎండాకాలంలో ఎక్కువ నీళ్లు తాగాలని చెబుతుంటారు. అలాగని నీళ్లు తాగుతూనే పోతుంటే.. శరీరంలో నీటి శాతం ఎక్కువై సమస్యలు తలెత్తుతాయి. ముఖ్యంగా కిడ్నీలు, కాలేయం, చర్మ సంబంధిత సమస్యలు, మధుమేహం, ఊబకాయం వంటి వాటితో బాధపడేవారికి అధిక నీటి శాతం ఇబ్బందులు తెచ్చిపెడుతుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

కిడ్నీ సమస్యలున్న వారికి డేంజర్..
‘‘కిడ్నీ సమస్యలతో బాధపడేవారికి ఓవర్ హైడ్రేషన్ (అవసరానికి మించి నీటిని తీసుకోవడం) పెద్ద సమస్యగా మారే అవకాశం ఉంటుంది. ఎందుకంటే కిడ్నీ సమస్య ఉన్నవారిలో.. కిడ్నీలు ఎక్కువగా ఉన్న నీటిని తొలగించలేకపోతాయి. దానితో రక్తంలోనూ నీటి శాతం పెరిగి, సోడియం వంటి ఖనిజ లవణాల శాతం తగ్గుతుంది. ఇది హైపోనేట్రిమియా అనే ప్రాణాపాయ స్థితికి దారి తీస్తుంది..” అని బెంగళూరుకు చెందిన వైద్య నిపుణుడు అశుతోష్ శుక్లా వెల్లడించారు.

మూత్రం రంగును బట్టి..
మన శరీరంలో కిడ్నీలు ఎప్పటికప్పుడు రక్తాన్ని శుద్ధి చేస్తూనే.. అదే సమయంలో అధికంగా ఉన్న నీటిని బయటికి పంపిస్తుంటాయి. ఈ క్రమంలో నీళ్లు తక్కువగా ఉన్నప్పుడు చిక్కగా, ముదురు పసుపు రంగులో మూత్రం ఉంటుంది. అదే నీటి శాతం సాధారణంగా ఉన్నప్పుడు లేత పసుపు రంగులోకి వస్తుంది. అదే నీటి శాతం ఎక్కువైతే తెలుపు రంగులో మూత్రం ఉంటుంది. దీన్ని బట్టి మన శరీరంలో నీటి శాతం పరిస్థితి తెలిసిపోతుందని వైద్యులు చెబుతున్నారు. అయితే మనం వాడే ఏవైనా మందులు, కిడ్నీల ఆరోగ్య పరిస్థితి, ఇతర అనారోగ్య సమస్యలు కూడా మూత్రం రంగును ప్రభావితం చేస్తుంటాయని.. ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలని అంటున్నారు.

ఎన్ని నీళ్లు తాగితే కరెక్ట్..?
సాధారణ పరిస్థితుల్లో పెద్ద వారు రోజూ ఎనిమిది నుంచి 12 గ్లాసుల మంచినీళ్లు తాగితే సరిపోతుంది. అంటే మూడు నుంచి నాలుగు లీటర్లు అన్నమాట. అయితే ఇది అందరికీ ఒకలా ఉండదు. స్పష్టంగా చెప్పుకోవాలంటే.. ప్రతి 20 కేజీల బరువుకు ఒక లీటర్ నీటిని తాగాలన్నది ఒక సాధారణ లెక్క అని వైద్యులు చెబుతున్నారు. అయితే ఇది ఆయా కాలాలను బట్టి మారుతుందని.. ఎండాకాలంలో అయితే మొత్తంగా అర లీటర్ నుంచి లీటర్ వరకు నీళ్లు ఎక్కువగా తీసుకోవాలని.. వానాకాలం, చలి కాలాల్లో ఒక లీటర్ వరకు తక్కువగా తీసుకున్నా ఇబ్బంది లేదని వివరిస్తున్నారు.
  • శరీరంలో నీటి శాతం తక్కువైతే డీహైడ్రేషన్ సమస్య తలెత్తుతుందని.. అదే ఎక్కువైతే హైపోనేట్రిమియా వంటి ఇబ్బందులు వస్తాయని నిపుణులు చెబుతున్నారు.

నీటి శాతం ఎక్కువైతే సమస్యలెన్నో..
  • శరీరంలో నీటి శాతం ఎక్కువైతే కిడ్నీలు అదే పనిగా పనిచేస్తూ వడగట్టి బయటికి పంపాల్సి ఉంటుంది. ఇది కిడ్నీలపై ఒత్తిడిని పెంచుతుంది.
  • తరచూ మూత్రానికి వెళ్లాల్సి రావడం వల్ల శరీరం నుంచి సోడియం, పోటాషియం వంటి లవణాలు బయటికి వెళ్లిపోతాయి. ఇది ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుంది.
  • అధికంగా నీళ్లు తాగడం వల్ల వికారం, వాంతులు, తలనొప్పి వంటివి వస్తాయి.
  • శరీరంలో లవణాల శాతం పడిపోవడం వల్ల కండరాల బలహీనత, వణుకు వంటివి వస్తాయని.. అత్యంత అరుదుగా స్పృహతప్పి పడిపోవడం, ఫిట్స్ రావడం వంటివీ తలెత్తవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు.
  • కొన్నిసార్లు గందరగోళం, ఏకాగ్రత లోపించడం వంటి మానసిక సంబంధిత సమస్యలూ వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

  • Loading...

More Telugu News