CBI: 'రూ. 100 కోట్లు ఇస్తే మీరే గవర్నర్'.. అంటూ మోసం చేస్తున్న ముఠా గుట్టు రట్టు చేసిన సీబీఐ
- అంతర్రాష్ట్ర ముఠాకు అరదండాలు
- ఉన్నత స్థాయిలో పరిచయాలు ఉన్నాయని ప్రచారం
- వారి ఫోన్ సంభాషణపై కొన్ని వారాలపాటు నిఘా ఉంచిన అధికారులు
- సోదాల సమయంలో అధికారులపై దాడి చేసి ఒకరు పరారీ
- మిగతా నలుగురికి బేడీలు
ప్రముఖ నటుడు రవితేజ నటించిన ‘వెంకీ’ సినిమాకు ఏమాత్రం తీసిపోని ఘటన. నిరుద్యోగులైన హీరో, అతడి స్నేహితులు ఉద్యోగాల కోసం కృష్ణ భగవాన్‌ను ఆశ్రయిస్తారు. ఆయన భలే హామీలిస్తాడు. ఎండీ పోస్టు కావాలా? జనరల్ మేనేజర్ పోస్టు కావాలా? అంటూ వారిని మభ్యపెడతాడు. ఇది కూడా అచ్చం అలాంటి ఘటనే!
తమకు 100 కోట్ల రూపాయలిస్తే రాజ్యసభ సీటు ఇప్పిస్తామని, లేదంటే గవర్నర్‌ను అయినా చేస్తామని, అదీ కాకుంటే ప్రభుత్వరంగ సంస్థ చైర్మన్‌ను చేస్తామంటూ ఓ ముఠా రంగంలోకి దిగింది. ఉన్నతస్థాయిలో తమకు పరిచయాలు ఉన్నాయని నమ్మిస్తూ వల విసిరే ప్రయత్నం చేసింది. చివరికి సీబీఐకి దొరికిపోయింది. ఢిల్లీకి చెందిన ఇద్దరు, మహారాష్ట్ర, కర్ణాటకకు చెందిన ఒక్కొక్కరిని సీబీఐ అరెస్ట్ చేసింది. ఢిల్లీకే చెందిన మరో వ్యక్తి తనిఖీల సందర్భంగా అధికారులపై దాడిచేసి పరారయ్యాడు.
ఈ కేసుకు సంబంధించి పూర్తి వివరాల్లో వెళ్తే.. మహారాష్ట్రలోని లాతూరుకు చెందిన కమలాకర్ ప్రేమ్‌కుమార్, కర్ణాటకలోని బెల్గాంకు చెందిన రవీంద్ర విఠల్‌నాయక్, ఢిల్లీకి చెందిన మహేంద్ర పాల్ అరోరా, అభిషేక్ బూరా, మహమ్మద్ ఐజాజ్‌ఖాన్ ఓ ముఠాగా ఏర్పడ్డారు. తనను తాను సీబీఐ అధికారిగా చెప్పుకున్న కమలాకర్.. తనకు ఉన్నతాధికారులతో పరిచయాలు ఉన్నాయని, డబ్బిస్తే ఎలాంటి పనైనా చేసిపెడతానని మిగతా వారికి చెప్పాడు. దీంతో అందరూ కలిసి ప్రజలను మోసం చేయాలని పథకం వేశారు. డబ్బులిస్తే రాజ్యసభ సీట్లు ఇప్పిస్తామని, గవర్నర్ పదవితోపాటు కేంద్ర ప్రభుత్వ సంస్థకు చైర్మన్‌ను కూడా చేస్తామని నమ్మించే ప్రయత్నం చేస్తూ ఓ ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. కొందరు ఆశావహులతో చర్చలు కూడా జరిపినట్టు సీబీఐ గుర్తించింది.
వీరి ఫోన్ సంభాషణపై కొన్ని నెలలపాటు నిఘా ఉంచి సీబీఐ ఎట్టకేలకు వారిని అరెస్ట్ చేసింది. సీబీఐ అధికారినని చెబుతూ కమలాకర్ కొన్ని కేసుల్లో పోలీసులపై ఒత్తిడి తెచ్చినట్టు కూడా సీబీఐ పేర్కొంది. కొన్ని కేసుల విచారణను కూడా అతడు ప్రభావితం చేసినట్టు తెలిపింది. ఈ కేసుకు సంబంధించి కమలాకర్, రవీంద్ర, మహేంద్ర పాల్ అరోరా, అభిషేక్ బూరాను అరెస్ట్ చేసింది. మరో నిందితుడైన ఐజాజ్‌ఖాన్ సోదాల సమయంలో సీబీఐ అధికారులపై దాడి చేసి పరారయ్యాడు.