India: దేశ విభజన బాధాకరం.. మూడు దేశాలు మళ్లీ కలవడం సాధ్యమే: హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్
- భారత్, పాకిస్థాన్, బంగ్లాదేశ్ లు మళ్లీ ఒకటి కావాల్సిన అవసరం ఉందన్న ఖట్టర్
- తూర్పు, పశ్చిమ జర్మనీలు కలిసిపోయినప్పుడు.. మనం ఎందుకు కలవలేమని ప్రశ్న
- మైనార్టీల్లో కాంగ్రెస్ పార్టీ అభద్రతా భావాన్ని నింపిందని వ్యాఖ్య
దేశ విభజన అత్యంత బాధాకరమని హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ అన్నారు. మళ్లీ భారత్, పాకిస్థాన్, బంగ్లాదేశ్ లు కలవాల్సిన అవసరం ఉందని చెప్పారు. తూర్పు జర్మనీ, పశ్చిమ జర్మనీ మళ్లీ కలిసిపోయిన విధంగానే విడిపోయిన మన మూడు దేశాలు కూడా కలవడం సాధ్యమేనని అన్నారు. విడిపోయిన రెండు జర్మనీలు కలసిపోయినప్పుడు... మన మూడు దేశాలు కలవడం ఎందుకు సాధ్యం కాదని ఆయన ప్రశ్నించారు. తూర్పు, పశ్చిమ జర్మనీలు కలిసిపోయి ఎంతో కాలం కాలేదని... 1991లో రెండు దేశాలు కలిసిపోయాయని... ఇరు దేశాల ప్రజలు బెర్లిన్ గోడను బద్దలుకొట్టారని చెప్పారు.
దేశ విభజన తర్వాత మైనార్టీ ప్రజలకు మైనార్టీ ట్యాగ్ ఇచ్చారని... భయం, అభద్రతాభావంతో వారు అభివృద్ధి చెందలేకపోయారని ఖట్టర్ అన్నారు. పొరుగు దేశాలతో భారత్ మంచి సంబంధాలను కొనసాగించాలని సూచించారు. గురుగ్రామ్ లో బీజేపీ జాతీయ మైనార్టీ మోర్చా మూడు రోజుల ట్రైనింగ్ క్యాంప్ ప్రారంభం సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఆరెస్సెస్ ను బూచిగా చూపిస్తూ కాంగ్రెస్ పార్టీ మైనార్టీల్లో అభద్రతా భావాన్ని నింపిందని ఆయన మండిపడ్డారు. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి మైనార్టీలను కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకుగానే చూసిందని విమర్శించారు.