KTR: కేటీఆర్ చదివించిన అనాథ విద్యార్థికి ఐదు ఎంఎన్సీల్లో ఉద్యోగ ఆఫర్లు

Orphan girl aided by KTR cracks 5 jobs

  • విషయం తెలుసుకొని సంతోషం వ్యక్తం చేసిన మంత్రి కేటీఆర్
  • ఆమె మరిన్ని ఉన్నత శిఖరాలకు చేరుకుంటుందని ఆశాభావం
  • కేటీఆర్ సాయంతో బీటెక్ పూర్తి చేసిన జగిత్యాల జిల్లాకు చెందిన రుద్ర రచన


తెలంగాణ ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ సొంత ఖర్చుతో బీటెక్ చదివించిన ఓ అనాథ విద్యార్థి ఐదు ఎంఎన్సీ కంపెనీల్లో ఉద్యోగాలు సాధించి ఔరా అనిపించింది. ఈ విషయం తెలుసుకున్న మంత్రి కేటీఆర్ చాలా సంతోషించారు. ఈ వార్త తన హృదయానికి ఎంతో హాయినిచ్చిందన్న కేటీఆర్.. సదరు యువతి మరిన్ని ఉన్నత శిఖరాలకు చేరుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. 

జగిత్యాల జిల్లా రాయికల్‌కు చెందిన రుద్ర రచన చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయింది. దాంతో, జగిత్యాలలో బాలల సదనంలో పదో తరగతి వరకు చదివింది. అప్పటి కలెక్టర్‌ శరత్‌ సహకారంతో హైదరాబాద్‌లోని యూసుఫ్‌గూడలో డిప్లొమా చదివి ఈ-సెట్‌లో మంచి ర్యాంక్‌ సాధించింది. ఈ విషయాన్ని ఆమె బావ ట్విట్టర్‌లో పోస్టు చేయగా మంత్రి కేటీఆర్‌ వెంటనే స్పందించారు. రచనను దత్తత తీసుకొని తన సొంత డబ్బుతో బీటెక్‌ చదివించారు. 

పట్టుదలతో కష్టపడి చదివిన రచన.. ఐదు బహుళజాతి కంపెనీల నుంచి జాబ్‌ ఆఫర్‌ లెటర్లు అందుకుంది. ఈ సందర్భంగా రచనను సోమవారం జగిత్యాల జడ్పీ అధ్యక్షురాలు దావ వసంత, ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌ తదితరులు సన్మానించారు. ఇందుకు సంబంధించిన న్యూస్ క్లిపింగ్స్ ను ట్విట్టర్లో షేర్ చేసిన మంత్రి కేటీఆర్ తాను చదివించిన విద్యార్థికి ఐదు ఉద్యోగ ఆఫర్లు రావడం తనకు ఎంతో సంతృప్తినిచ్చిందని ట్వీట్ చేశారు.

  • Loading...

More Telugu News