Ravi Shastri: వన్డేలు బతకాలంటే ఈ మార్పు చేయాల్సిందే: రవిశాస్త్రి
- గతంలో వన్డేలను 60 ఓవర్ల నుంచి 50 ఓవర్లకు తగ్గించారన్న శాస్త్రి
- ప్రస్తుత పరిస్థితుల్లో 50 ఓవర్ల మ్యాచ్ చాలా ఎక్కువని వ్యాఖ్య
- 40 ఓవర్లకు కుదిస్తేనే వన్డేలు బతుకుతాయని సలహా
ఇంగ్లండ్ స్టార్ ప్లేయర్ బెన్ స్టోక్స్ వన్డేలకు గుడ్ బై చెప్పినప్పటి నుంచి ఈ ఫార్మట్ పై పెద్ద చర్చ జరుగుతోంది. వన్డేలకు ఆదరణ తగ్గుతోందని... అంతర్జాతీయ క్రికెట్ షెడ్యూల్ నుంచి ఈ ఫార్మాట్ ను క్రమంగా తొలగించాలని పాక్ క్రికెట్ దిగ్గజం వసీమ్ అక్రమ్ లాంటి దిగ్గజాలు అంటున్నారు.
తాజాగా టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి వన్డేల గురించి మాట్లాడుతూ... వన్డేలు 50 ఓవర్ల పాటు కొనసాగుతుండటంతో ప్రేక్షకులు బోర్ ఫీల్ అవుతున్నారని... ఈ ఫార్మాట్ ను 40 ఓవర్లకు కుదిస్తే మంచిదని చెప్పారు. మ్యాచ్ వ్యవధిని తగ్గించడం వల్ల వన్డేలకు వచ్చే ప్రమాదం ఏమీ లేదని అన్నారు.
వన్డేలు ప్రారంభమయినప్పుడు ఇరు జట్లు 60 ఓవర్ల చెప్పున ఆడేవని... ఆ తర్వాత వాటిని 50 ఓవర్లకు తగ్గించారని రవిశాస్త్రి గుర్తు చేశారు. అప్పట్లో 10 ఓవర్లు తగ్గించడం వల్ల వన్డేలకు ఆదరణ తగ్గలేదని అన్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు 50 ఓవర్ల మ్యాచ్ లు ఆడుతున్నామని చెప్పారు. సుదీర్ఘ కాలంగా 50 ఓవర్లతో కొనసాగుతున్న ఈ ఫార్మాట్ ను ఎందుకు మార్చకూడదని ప్రశ్నించారు. ప్రస్తుత పరిస్థితుల్లో 50 ఓవర్లు చాలా ఎక్కువని... అందువల్ల సమయానుకూలంగా నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. వన్డేలను 40 ఓవర్లకు కుదిస్తేనే ఈ ఫార్మాట్ బతుకుతుందని అన్నారు.