Sonia Gandhi: నేషనల్ హెరాల్డ్ కేసు: నేడు మూడోసారి ఈడీ ముందుకు సోనియాగాంధీ
- నిన్న రెండో విడత ఆరు గంటలపాటు విచారించిన ఈడీ అధికారులు
- నేడు కూడా రావాలంటూ సమన్లు
- ఈడీ తీరుకు వ్యతిరేకంగా కాంగ్రెస్ సత్యాగ్రహ దీక్ష
- రాహుల్ గాంధీ సహా సీనియర్ నేతలను అదుపులోకి తీసుకున్న పోలీసులు
నేషనల్ హెరాల్డ్ వార్తాపత్రిక యాజమాన్యంలోని యంగ్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్‌లో ఆర్థిక అవకతవకలకు సంబంధించి కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ మూడో విడత విచారణ కోసం నేడు ఈడీ ఎదుట హాజరు కానున్నారు. నిన్న దాదాపు ఆరు గంటలపాటు సోనియాను విచారించిన అధికారులు నేడు కూడా విచారణకు రావాలని సమన్లు జారీ చేశారు.
మరోపక్క, సోనియాను ఈడీ ప్రశ్నించడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ శ్రేణులు దేశవ్యాప్తంగా ‘సత్యాగ్రహ’ దీక్ష పేరుతో ఆందోళనకు దిగాయి. ప్రతిపక్షాలను వేధించేందుకు దర్యాప్తు సంస్థలను కేంద్రం ఉపయోగించుకుంటోందని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఈడీ సమన్లకు వ్యతిరేకంగా నిన్న ఆందోళనకు దిగిన పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ, ఇతర సీనియర్ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈడీ తీరును నిరసిస్తూ కాంగ్రెస్ ఎంపీలు పార్లమెంటులోని గాంధీ విగ్రహం నుంచి విజయ్ చౌక్ వరకు మార్చ్ నిర్వహించారు.