Andhra Pradesh: వరద భయంతో తెలంగాణకు తరలిపోతున్న విలీన మండలాల ప్రజలు
- గోదావరి వరదలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రజలు
- ఆగస్టులో మరోమారు వరదలు వస్తాయన్న భయం
- ఇళ్లు ఖాళీ చేసి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు తరలిపోతున్న బాధితులు
వరద భయంతో ఏపీలోని విలీన మండలాల ప్రజలు తెలంగాణకు తరలిపోతున్నారు. గోదావరి వరదల కారణంగా విలీన మండలాల ప్రజలు ఇటీవల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ నేపథ్యంలో మరోమారు వరద వస్తుందన్న భయంతో పెట్టేబేడా సర్దుకుని తెలంగాణకు తరలిపోతున్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలోని వరరామచంద్రపురం, కూనవరం మండలాల్లోని కొందరు ముందు జాగ్రత్తగా డీసీఎంలలో సామన్లు తీసుకుని తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలానికి తరలిపోతున్నారు.
అక్కడ తాము ఇళ్లు అద్దకు తీసుకున్నామని, అక్కడికే వెళ్లిపోతున్నామని చెప్పారు. వరదల కారణంగా తాము ప్రతి సంవత్సరం ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేసిన బాధితులు.. ఆగస్టులో మరింత వరద వచ్చే అవకాశం ఉందని, అందుకనే ముందు జాగ్రత్తగా ఇళ్లు ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోతున్నట్టు చెప్పారు.