Kabaddi: మైదానంలో ప్రాణాలు కోల్పోతున్న ఆటగాళ్లు.. కూతకు వెళ్లి మరణించిన కబడ్డీ ప్లేయర్!
- ప్రత్యర్థి ఆటగాళ్లు పట్టుకోవడంతో కిందపడిన విమల్ రాజ్
- కాసేపటికే అచేతనంగా మారడంతో ఆసుపత్రికి తరలింపు
- అప్పటికే మృతి చెందాడన్న వైద్యులు
- ఇటీవల రింగులోనే ప్రాణాలు కోల్పోయిన బెంగళూరు యువ కిక్బాక్సర్
తమిళనాడులోని కడలూరు జిల్లాలో జరిగిన కబడ్డీ పోటీల్లో విషాదం చోటుచేసుకుంది. కూతకు వెళ్లిన ఆటగాడిని ప్రత్యర్థి జట్టు పట్టుకోవడంతో కిందపడిన యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. పన్రుటిలో జరిగిన స్థానిక మ్యాచ్‌లో 22 ఏళ్ల ఆటగాడు విమల్ రాజ్ కూతకు వెళ్లాడు. ప్రత్యర్థి జట్టు ఆటగాళ్లు పట్టుకోవడంతో కిందపడ్డాడు. పైకి లేవాలని ప్రయత్నించిన విమల్‌రాజ్ ఆ తర్వాత అచేతనంగా మారిపోయాడు. వెంటనే అప్రమత్తమైన ఆటగాళ్లు అతడిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అతడు అప్పటికే మరణించినట్టు ధ్రువీకరించడంతో ఒక్కసారిగా విషాదం నెలకొంది.
విమల్‌రాజ్ ప్రస్తుతం సేలం జిల్లాలోని ఓ ప్రైవేటు కాలేజీలో బీఎస్సీ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. హార్ట్ ఎటాక్ కారణంగానే అతడు మరణించి ఉంటాడని అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దర్యాప్తు అనంతరం అతడి మృతికి గల కారణాన్ని వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.
కాగా, బెంగళూరులో ఇటీవల జరిగిన కిక్‌బాక్సింగ్ పోటీల్లో మైసూరుకు చెందిన 24 ఏళ్ల కిక్బాక్సర్ నిఖిల్ ప్రాణాలు కోల్పోయాడు. పోటీ జరుగుతుండగా ప్రత్యర్థి అతడి ముఖంపై పిడిగుద్దులు కురిపించడంతో కుప్పకూలిన నిఖిల్ రింగ్‌లోనే ప్రాణాలు వదిలాడు. ఈ ఏడాది మొదట్లో తెలంగాణలోని సూర్యాపేటలో 48వ జాతీయ జూనియర్ కబడ్డీ టోర్నీ సందర్భంగా స్టాండ్ కుప్పకూలడంతో వందమందికిపైగా క్రీడాకారులు గాయపడ్డారు.