Kerala: అదృష్టం అంటే అదేమరి.. అప్పుల బాధతో ఇల్లు అమ్మేస్తుంటే కోటి రూపాయల లాటరీ కొట్టాడు!

Kerala man wins Rs 1 crore lottery hours before selling his home to clear debts

  • కేరళలోని కోజికోడ్ లో ఓ పెయింటర్ కు జాక్ పాట్
  • కూతుళ్ల పెళ్లి కోసం అప్పు చేసిన మొహమ్మద్ బవా
  • అప్పులు తీర్చేందుకు ఇల్లు అమ్మకానికి పెట్టిన పెయింటర్  
  • రెండు గంటల ముందు లాటరీ గెలిచిన వైనం 

చేసిన అప్పులు తీర్చేందుకు ఓ వ్యక్తి ఇంటిని అమ్మాలని నిర్ణయించుకున్నాడు. ఇంకో రెండు గంటల్లో బేరం పూర్తవుతుందనగా అతను కోటి రూపాయల లాటరీ గెలుచుకున్నాడు. ఇది సినిమా సీన్ కాదు. కేరళలోని కోజికోడ్‌కు చెందిన 50 ఏళ్ల మొహమ్మద్ బవా అనే వ్యక్తి నిజ జీవితంలో జరిగిన సంఘటన. బవా పెయింటర్ పని చేస్తున్నాడు. అతనికి భార్య, నలుగురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నాడు. ఇద్దరు కూతుళ్లకు పెళ్లి చేయడంతో పాటు ఎనిమిది నెలల కిందట ఇల్లు కట్టుకున్నాడు. 

ఈ క్రమంలో బవా అప్పుల ఊబిలో కూరుకుపోయాడు. బ్యాంకులు, బంధువుల దగ్గర దాదాపు రూ.50 లక్షలు అప్పు చేశాడు. తన కుమారుడు నిజాముద్దీన్‌ను ఖతార్‌కు పంపించేందుకు కూడా మరికొంత అప్పు చేయాల్సి వచ్చింది. అప్పు ఇచ్చిన వాళ్లు తిరిగి చెల్లించాలని ఒత్తిడి తీసుకురావడంతో తన ఇల్లు అమ్మి, అద్దె ఇంటికి మారాలని భావించాడు. తన 2000 చదరపు అడుగుల ఇంటిని 40 లక్షల రూపాయలకు విక్రయించేందుకు సోమవారం అడ్వాన్స్ తీసుకోబోతుండగా అతనికి జాక్‌పాట్ తగిలింది. 

 హోసంగడిలోని ఓ ఏజెన్సీలో అతను కొనుగోలు చేసిన లాటరీ కోటి రూపాయలు గెలిచినట్టు తెలిసింది. అంతే.. తమ అప్పులు, కష్టాలు తీరిపోతున్నాయని తెలిసి బవా, అతని కుటుంబంలో ఆనందం వెల్లివిరిసింది. సోమవారం సాయంత్రం రియల్ ఎస్టేట్ బ్రోకర్ ఇల్లు కొనడానికి పార్టీతో ఇంటికి రాగా.. తాను ఇల్లు అమ్మడం లేదని బవా వాళ్లకు చెప్పాడు. ఈ లాటరీలో పన్నులు మినహాయించిన తర్వాత అతను దాదాపు రూ. 63 లక్షలు అందుకోనున్నాడు. అదృష్టం తలుపు తట్టడం అంటే ఇదేనేమో!

  • Loading...

More Telugu News