Gotabaya Rajapaksa: గొటబాయ రాజపక్స త్వరలోనే శ్రీలంకకు తిరిగి వస్తారు: కేబినెట్ ప్రతినిధి గుణవర్దన
- దేశం విడిచి సింగపూర్ కు పారిపోయిన గొటబాయ
- మరో 14 రోజులు వీసాను పొడిగించిన సింగపూర్
- ఇటీవల జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో గెలుపొందిన రణిల్ విక్రమసింఘే
శ్రీలంక ప్రజల ఆగ్రహానికి గురైన మాజీ అధ్యక్షుడు గొటబాయ రాజపక్స దేశం విడిచి పారిపోయిన సంగతి తెలిసిందే. శ్రీలంక నుంచి మాల్దీవులకు, అక్కడి నుంచి సింగపూర్ కు వెళ్లారు. సింగపూర్ ఆయనకు 14 రోజుల తాత్కాలిక వీసాను మంజూరు చేసింది. తాజాగా ఆ వీసాను మరో 14 రోజులు పొడిగించింది. ఆయనకు సంబంధించి ఒక కీలక విషయాన్ని శ్రీలంక కేబినెట్ ప్రతినిధి గుణవర్దన వెల్లడించారు.
త్వరలోనే గొటబాయ రాజపక్స సింగపూర్ నుంచి శ్రీలంకకు వస్తారని ఆయన తెలిపారు. అయితే, కచ్చితంగా ఎప్పుడు వస్తారనే విషయాన్ని మాత్రం ఆయన చెప్పలేదు. మరోవైపు, గొటబాయ రాజీనామాతో ఇటీవలే శ్రీలంక అధ్యక్షుడి ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో రణిల్ విక్రమసింఘే గెలుపొందారు. అధ్యక్షుడిగా ఆయన బాధ్యతలను నిర్వహిస్తున్నారు.