Team India: మూడో వన్డేను నిలిపేసిన వరుణుడు
- 24 ఓవర్లు పూర్తి కాగానే మొదలైన వర్షం
- 24 ఓవర్లలో ఓ వికెట్ నష్టానికి 115 పరుగులు చేసిన టీమిండియా
- ఓపెనర్లిద్దరూ హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకున్న వైనం
- గబ్బర్ అవుట్ కాగా... గిల్‌కు జత కలిసిన అయ్యర్
వెస్టిండీస్‌తో టీమిండియా ఆడుతున్న మూడో వన్డే వర్షం కారణంగా మధ్యలోనే నిలిచిపోయింది. వెస్టిండీస్ పర్యటనలో ఉన్న టీమిండియా ఆతిథ్య జట్టుతో 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో ఇప్పటికే రెండు వన్డేలు ఆడిన సంగతి తెలిసిందే. ఈ 2 వన్డేల్లోనూ విజయం సాధించిన టీమిండియా ఇప్పటికే సిరీస్‌ను కైవసం చేసుకుంది. తాజాగా బుధవారం రాత్రి ఇరు జట్ల మధ్య మూడో వన్డే ప్రారంభం కాగా... తొలుత బ్యాటింగ్ ప్రారంభించిన టీమిండియా 24 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేసింది. ఆ తర్వాత వర్షం మొదలవడంతో అంపైర్లు మ్యాచ్‌ను నిలిపేశారు.
మ్యాచ్ నిలిచిపోయే సమయానికి 24 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేసిన టీమిండియా ఒక వికెట్ నష్టానికి 115 పరుగులు చేసింది. టీమిండియా ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన కెప్టెన్ శిఖర్ ధావన్ 74 బంతుల్లో 7 ఫోర్ల సాయంతో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకుని 58 పరుగులు చేసి హెడెన్ వాల్ష్ బౌలింగ్‌లో నికోలస్ పూరన్‌కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు.
ధావన్‌తో కలిసి జట్టు బ్యాటింగ్ ప్రారంభించిన శుభ్‌మన్ గిల్ 65 బంతుల్లో 3 ఫోర్లు, ఓ సిక్స్ సాయంతో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకుని 51 పరుగులు చేశాడు. ధావన్ అవుట్ కావడంతో అతడి స్థానంలో శ్రేయాస్ అయ్యర్ క్రీజులోకి వచ్చాడు. మ్యాచ్ నిలిచే సమయానికి 6 బంతులను ఎదుర్కొన్న అయ్యర్ 2 పరుగులు చేశాడు.