South Central Railway: రాజమహేంద్రవరం బ్రిడ్జిపై రైలు ట్రాక్ మరింత పటిష్ఠం.. రైళ్ల వేగం పెంపు
- రైలు పట్టాల కింద ఉన్న స్లీపర్లను మార్చిన అధికారులు
- ట్రాక్‌ను మరింత పటిష్ఠం చేయడంతో వేగం పెంపు
- గంటకు 50 కిలోమీటర్ల వేగంతో పరుగులు పెట్టనున్న రైళ్లు
గోదావరి నదిపై గోదావరి-కొవ్వూరు స్టేషన్ల మధ్య ఉన్న వంతెనపై నుంచి వెళ్లే రైళ్ల గరిష్ఠ వేగాన్ని దక్షిణ మధ్య రైల్వే పెంచింది. 2.9 కిలోమీటర్ల పొడవున్న రాజమహేంద్రవరం బ్రిడ్జిపై రైలు పట్టాల కింద ఉండే స్లీపర్లను ఇటీవల మార్చిన అధికారులు ట్రాక్‌ను మరింత పటిష్ఠం చేశారు. అంతకుముందు ఈ బ్రిడ్జిపై రైళ్లు గంటకు 30 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించేవి.
ఈ ఏడాది ఏప్రిల్‌లో ఆ వేగాన్ని 40 కిలోమీటర్లకు పెంచారు. ట్రాక్‌ను పటిష్ఠం చేసిన తర్వాత ఇప్పుడా వేగాన్ని 50 కిలోమీటర్లకు పెంచినట్టు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. వేగాన్ని పెంచడం ద్వారా రద్దీ తగ్గుతుందని, సమయపాలన పెరుగుతుందని పేర్కొంది.