Somireddy Chandra Mohan Reddy: కశ్మీర్ లో నియోజకవర్గాల పునర్విభజనకు అవసరం లేని చట్ట సవరణ తెలుగు రాష్ట్రాలకే అవసరమైందా?: సోమిరెడ్డి

Somireddy fires on Centre for not increasing assembly constituencies in AP and TS

  • 2026 వరకు నియోజకవర్గాల పునర్విభజన సాధ్యం కాదన్న కేంద్రం
  • పునర్విభజనకు చట్ట సవరణ అవసరమని వివరణ
  • ఒక్కో రాష్ట్రం విషయంలో ఒక్కోలా నిర్ణయం తీసుకుంటున్నారని సోమిరెడ్డి మండిపాటు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఇప్పట్లో అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన చేయడం సాధ్యం కాదని కేంద్ర ప్రభుత్వం నిన్న స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. నియోజకవర్గాల పునర్విభజన జరగాలంటే రాజ్యాంగ సవరణ చేయాల్సి ఉంటుందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్ రాజ్యసభలో తెలిపారు. 2026 వరకు నియోజకవర్గాల పునర్విభజన ఉండదని చెప్పారు. 2026 తర్వాత వచ్చే జనాభా లెక్కల ఆధారంగా అసెంబ్లీ స్థానాల పునర్విభజన ఉంటుందని తెలిపారు. మరోవైపు, 2026లో జనాభా లెక్కలు వచ్చి, రాజ్యంగ సవరణ చేసి, పునర్విభజన ప్రక్రియను ప్రారంభించి, దాన్ని పూర్తి చేయాలంటే 2031 వరకు ఆగాల్సిందే. 

ఈ నేపథ్యంలో, కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రకటనపై టీడీపీ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మండిపడ్డారు. తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ నియోజకవర్గాల పెంపు 2031 వరకు సాధ్యం కాదని కేంద్ర ప్రభుత్వం చెప్పడం విడ్డూరంగా ఉందని అన్నారు. విభజన చట్టం హామీల్లో పునర్విభజన చట్టం ఉందనే విషయాన్ని కేంద్ర పెద్దలు గుర్తుంచుకోవాలని చెప్పారు. కశ్మీర్ లో నియోజకవర్గాల పునర్విభజనకు లేని చట్ట సవరణ తెలుగు రాష్ట్రాలకే అవసరమైందా? అని ప్రశ్నించారు. ఒక్కో రాష్ట్రం విషయంలో ఒక్కోలా నిర్ణయం తీసుకోవడం కేంద్ర ప్రభుత్వానికి సరికాదని అన్నారు. విభజన చట్టంలో పేర్కొన్న నియోజకవర్గాల పునర్విభజన హామీని వెంటనే నెరవేర్చాలని ఆయన డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News