sikhar dhawan: ప్రతి ఒక్కరినీ పేరు పేరునా మెచ్చుకున్న శిఖర్ ధావన్
- ఎలా ఆడాలన్నది మహమ్మద్ సిరాజ్ కు తెలుసని వ్యాఖ్య
- దీపక్ హుడా పట్ల తమ నమ్మకం బలపడిందన్న కెప్టెన్
- జట్టు సమష్టి కృషి ఫలితమే ఇదన్న ధావన్
శిఖర్ ధావన్.. ఈ సీనియర్ క్రికెటర్ కెప్టెన్ గా తనకు లభించిన అవకాశాన్ని చక్కగా వినియోగించుకున్నాడు. కెప్టెన్సీకి తాను సమర్థుడినేనని నిరూపించుకున్నాడు. వెస్టిండీస్ గడ్డపై ఆతిథ్య జట్టును వరుసగా మూడు వన్డే మ్యాచుల్లో ఓడించి భారత జట్టు ఘనంగా కప్పును సొంతం చేసుకుంది. ఈ తరుణంలో మూడో మ్యాచ్ లో ఘన విజయం తర్వాత శిఖర్ ధావన్ మీడియాతో మాట్లాడాడు.
దాదాపు అందరినీ మెచ్చుకుంటూ ఒక్కొక్కరి బలాలను ప్రస్తావించాడు. ముఖ్యంగా మూడో వన్డేలో రెండు వికెట్లు తీసిన మహమ్మద్ సిరాజ్ ప్రతిభను ధావన్ ప్రశంసించాడు. ‘‘అతడు ఓ నాణ్యమైన బౌలర్. ఎంతో కాలంగా ఆడుతున్నాడు. అతడిపై అతడికి ఎంతో విశ్వాసం. కొన్ని సందర్భాల్లో ఓ ఫీల్డర్ ను ఫలానా చోట ఉంచితే.. వెంటనే ‘వద్దు నాకు అలా వద్దు’అంటూ వేరే చోట మోహరించాలని సూచిస్తాడు. నాకది నచ్చుతుంది. అతడు రెండు వికెట్లు తీశాడు. అతడు ఏం చేయాలో అతడికి తెలుసు. దాంతో కెప్టెన్ గా నా పని సులువు అయింది. ఆటగాళ్లు వారి పాత్ర ఏంటన్నది తెలుసుకుంటే అది మంచిది’’ అని శిఖర్ ధావన్ వివరించాడు.
దీపక్ హుడా గురించి మాట్లాడుతూ.. బాల్ తోనూ అతడు రాణించినట్టు చెప్పాడు. మూడు మ్యాచుల్లోనూ హుడా బౌలింగ్ చేశాడు. రెండో వన్డేలో ఒక వికెట్ కూడా తీశాడు. ‘‘సిరీస్ కు ముందు ఆల్ రౌండర్ పాత్రకి సరిపోతాడని భావించాం. మొదటి మ్యాచ్ లో అతడి ఆటను చూసిన తర్వాత నమ్మకం బలపడింది. నాలుగైదు ఓవర్లకు బదులు 7-8 ఓవర్లు బౌలింగ్ చేయగలడని అర్థమైంది. అందుకే అతడితో మూడో వన్డేలో బౌలింగ్ ఆరంభించాం. అతడు ఒక్క పరుగు కూడా ఇవ్వకుండా తొలి ఓవర్ వేశాడు’’ అని ధావన్ దీపక్ హుడా ప్రతిభను వివరించాడు.
జట్టు సమష్టిగా పోరాడిన ఫలితమే ఇదన్నాడు ధావన్. ‘‘జట్టును చూసి గర్వపడుతున్నాను. ప్రతీ మ్యాచ్ లోనూ మేము సవాళ్లను అవకాశాలుగా మలుచుకున్నాం. మేమేంటో చూపించాం. ప్రతి ఒక్కరి పనితీరు పట్ల నేను సంతోషంగా ఉన్నాను’’ అని ధావన్ పేర్కొన్నాడు.