Six layer: ఎన్ని లేయర్ల మాస్క్ అయితే మంచిది?
- కనీసం ఆరు లేయర్లు ఉంటే మంచి రక్షణ
- కరోనా పోయినా మాస్క్ వాడకాన్ని కొనసాగించడమే మేలు
- ఎన్నో విధాలుగా రక్షణనిస్తుందంటున్న నిపుణులు
కరోనా వచ్చిన తర్వాతే చాలా మందికి ఫేస్ మాస్క్ లు అలవాటయ్యాయి. అప్పటి వరకు మాస్క్ ల ధారణ అన్నదే చాలా మందికి తెలియదు. కానీ, జపాన్ వంటి దేశాల్లో పౌరులు కొందరు స్వచ్ఛందంగానే మాస్క్ లను ధరించే అలవాటు ఉంది. వైరస్, బ్యాక్టీరియా, దుమ్ము, అలర్జీ కారకాల నుంచి మాస్క్ తో రక్షణ కల్పించుకోవచ్చు. అందుకని కరోనా సమసిపోయిందని చెప్పి మాస్క్ తీసేసి పక్కన పడేయక్కర్లేదు. బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ ధారణ అలవాటు కొనసాగించడమే మంచిదని నిపుణుల సూచన.
పేరుకు మాస్క్ కాకుండా, అది మనకు మెరుగైన రక్షణనిచ్చేది అయి ఉంటేనే ప్రయోజనం. క్లాత్ మాస్క్ లు కూడా బాగానే వినియోగంలో ఉన్నాయి. ఉన్న వాటిల్లో ఎన్95 మెరుగైన మాస్క్ అని ఇప్పటికే నిపుణులు తేల్చేశారు. ఎందుకంటే కరోనా వైరస్ పరిమాణం 0.125 మైక్రాన్లు. ఎన్95 మాస్క్ లు వీటిని సమర్థంగా అడ్డుకోగలవు. అలాగే, సర్జికల్ మాస్క్ కూడా మెరుగైన రక్షణనిస్తుంది. ఇక ఆరు లేయర్లతో కూడిన క్లాత్ మాస్క్ కూడా మంచి రక్షణనిస్తుందని నిపుణులు చెబుతున్నారు. కనుక వీటిని రోజువారీగా వినియోగించుకోవచ్చు.
ఆరు లేయర్లు ఉండడం వల్ల వైరస్ అతి సూక్ష్మంగా ఉన్నప్పటికీ లోపలికి రాకుండా అడ్డుపడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇక్కడ పర్యావరణ కోణం కూడా ఉంది. ఎన్95, డిస్పోజబుల్ సర్జికల్ మాస్క్ లను రీసైకిల్ చేయడం ఇబ్బంది. అదే క్లాత్ మాస్క్ తో ఈ ఇబ్బంది ఉండదు. పర్యావరణ అనుకూలమైనది, పైగా చౌక అయినది. శ్వాస తీసుకునేందుకు కూడా అంత ఇబ్బంది ఉండకపోవడం వీటి అనుకూలత. ఆరు లేయర్ల కంటే తక్కువ లేయర్లు ఉండే క్లాత్ మాస్క్ లతో పూర్తి రక్షణ ఉండదని నిపుణులు సూచిస్తున్నారు.