Bollywood: తమ్ముడి దర్శకత్వంలో హీరోయిన్గా బాలీవుడ్ నటి
- తొలిసారి నాయికా ప్రాధాన్యం ఉన్న చిత్రంలో నటిస్తున్న
సోనాక్షి సిన్హా - చిత్రం పేరు ‘నికితా రాయ్ అండ్ ద బుక్ ఆఫ్ డార్క్‌నెస్’
- దర్శకుడిగా పరిచయం అవుతున్న సోనాక్షి తమ్ముడు ఖుష్
బాలీవుడ్ దిగ్గజ నటుడు శత్రఘ్న సిన్హా వారసురాలిగా చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టిన నటి సోనాక్షి సిన్హా. సల్మాన్ ఖాన్ సరసన ‘దబాంగ్’ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన సోనాక్షి తన కెరీర్‌లో ఇంత వరకు పలు సినిమాల్లో నటించి పేరు తెచ్చుకుంది. కానీ ఇప్పటిదాకా నాయికా ప్రాధాన్యత ఉన్న చిత్రం చేయలేదామె. ఇప్పుడు తన కోరిక తీరబోతోంది.‘నికితా రాయ్ అండ్ ద బుక్ ఆఫ్ డార్క్‌నెస్’ పేరుతో రూపొందనున్న ఈ చిత్రాన్ని అధికారికంగా ప్రకటించారు.
ఈ సందర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్ నిండా చీకటి అలముకుని ఉంది. మధ్యలో చిన్న వెలుతురు మాత్రం ఉంది. అందులో సోనాక్షి అటు తిరిగి కనిపిస్తోంది. పొడవాటి చెట్లు, వాటి మధ్యన ఓ వ్యక్తి నీడ కనిపిస్తున్నాయి. ఈ పోస్టర్, టైటిల్‌ని బట్టి ఇదో థ్రిల్లర్ చిత్రం అని అర్థమవుతోంది. ఈ చిత్రానికి సోనాక్షి తమ్ముడు ఖుష్ దర్శకత్వం వహిస్తుండటం మరో విశేషం. అతనికి ఇదే తొలి చిత్రం.
పరేష్ రావల్, సుహైల్ నయ్యర్ ఇతర పాత్రల్లో నటించనున్న ఈ చిత్రాన్ని ఎన్‌వీబీ ఫిల్మ్స్, నికితా పాయ్ ఫిల్మ్స్ సంస్థలతో కలిసి ఖుష్ నిర్మిస్తున్నాడు. ఇలాంటి చిత్రం కోసం తాను ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నానని సోనాక్షి చెప్పింది. ఇన్నాళ్లకు తన కోరిక నెరవేరడంతో సంతోషంగా ఉందని తెలిపింది. తన అక్క చాలా ప్రతిభావంతురాలన్న ఖుష్.. ఆమె సినిమాతో డైరెక్టర్‌గా ఎంట్రీ ఇవ్వడం ఆనందంగా ఉందని ఖుష్ అంటున్నాడు.