Sonia Gandhi: సోనియాను బీజేపీ ఎంపీలు వేధించిన అంశాన్ని ప్రివిలేజ్ కమిటీ దృష్టికి తీసుకెళ్లండి... లోక్ సభ స్పీకర్ కు కాంగ్రెస్ ఎంపీల లేఖ

Congress MPs wrote Lok Sabha speaker

  • పార్లమెంటులో రాష్ట్రపత్ని వ్యాఖ్యల దుమారం 
  • సోనియా గాంధీని టార్గెట్ చేసిన బీజేపీ ఎంపీలు
  • తీవ్రంగా పరిగణించిన కాంగ్రెస్ సభ్యులు
  • బీజేపీ ఎంపీలపై చర్యలు తీసుకోవాలంటూ విజ్ఞప్తి

లోక్ సభలో ఇవాళ జరిగిన పరిణామాలపై కాంగ్రెస్ సభ్యులు స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ పట్ల బీజేపీ ఎంపీల అనుచిత ప్రవర్తనను ప్రివిలేజ్ కమిటీ దృష్టికి తీసుకెళ్లేందుకు స్పీకర్ చొరవ తీసుకోవాలని లోక్ సభలో కాంగ్రెస్ సభాపక్ష నేత అధిర్ రంజన్ చౌదరి, ఇతర ఎంపీలు ఆ లేఖలో కోరారు.

ఇవాళ లోక్ సభ వాయిదాపడిన తర్వాత బీజేపీ ఎంపీలు పెద్ద సంఖ్యలో సోనియా గాంధీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారని వెల్లడించారు. ఎందుకు నిరసన తెలుపుతున్నారంటూ బీజేపీ సభ్యురాలు రమాదేవితో సోనియా మాట్లాడుతుండగా, కొందరు కేంద్రమంత్రులు సహా బీజేపీ ఎంపీలు ఆమెను చుట్టుముట్టి మాటలదాడి చేశారని, భయపెట్టేందుకు ప్రయత్నించారని కాంగ్రెస్ ఎంపీలు ఆరోపించారు.

దాంతో కాంగ్రెస్ పార్టీ మహిళా ఎంపీలు, ఇతర విపక్ష సభ్యులు వచ్చి సోనియాను అక్కడ్నించి క్షేమంగా ఇవతలికి తీసుకువచ్చారని వివరించారు. లేకపోతే సోనియా గాయపడి ఉండేవారని కాంగ్రెస్ ఎంపీలు లోక్ సభ స్పీకర్ కు రాసిన తమ లేఖలో పేర్కొన్నారు. 

బీజేపీ సభ్యుల దౌర్జన్యపూరిత ప్రవర్తనను ప్రివిలేజ్ కమిటీ దృష్టికి తీసుకెళ్లడంలో మీరు జోక్యం చేసుకోవాలంటూ స్పీకర్ ఓం బిర్లాను కోరారు. దురుసుగా ప్రవర్తించిన వారిని సభ నుంచి సస్పెండ్ చేసేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. 

భారత నూతన రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌదరి రాష్ట్రపత్ని అని పేర్కొడంతో బీజేపీ ఎంపీలు పార్లమెంటులో ఆగ్రహావేశాలు ప్రదర్శించారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఈ వ్యాఖ్యలకు బాధ్యత వహించాలంటూ లోక్ సభలో నిరసనలు చేపట్టారు.

  • Loading...

More Telugu News