Eating: ఏమీ తినబుద్ధి కాకపోవడం.. లేక అతిగా తినేయడం.. రెండూ ఆరోగ్య సమస్యలే అంటున్న వైద్య నిపుణులు!

Take a look at some of the common eating disorders

  • మానసిక ఇబ్బందులతో ఆహారం తీసుకోవడంలో సమస్యలు
  • బరువు పెరిగిపోతున్నామనే భావనతో ‘బులీమియా నెర్వోసా’ సమస్య
  • శరీరం బలహీనమై, రోగ నిరోధక శక్తి దెబ్బతింటుందన్న నిపుణులు

ఆహారం తీసుకునే విషయంలో ఒక్కొక్కరు ఒక్కోలా ఉంటారు. కానీ కొన్నిసార్లు మాత్రం ఏవో సమస్యలు తలెత్తుతుంటాయి. ఆహారం తీసుకోవాలని అనిపించకపోవడం, అసలు ఆకలే వేయకపోవడం వంటి సమస్యల నుంచి తెలియకుండానే ఏదో ఒకటి తింటూ ఉండటం, తరచూ ఆకలిగా అనిపిస్తూ ఉండటం దాకా ఎన్నో సమస్యలు వస్తుంటాయి. 

వీటిని అంత త్వరగా గుర్తించలేం. బాగా బరువు తగ్గిపోయి అనారోగ్యం పాలవడం లేదా విపరీతంగా బరువు పెరిగిపోయి ఊబకాయం దాకా వెళ్లిపోవడం జరిగిపోతుంది. సరిగా తిండి తినే అలవాటు లేకపోవడంతోపాటు మానసిక, శారీరక సమస్యలు ఈ రకమైన ఇబ్బందులకు దారి తీస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వీటిని నిర్లక్ష్యం చేస్తే ఆరోగ్యం దెబ్బతినడం ఖాయమని చెబుతున్నారు. ఆహారం తీసుకోవడం విషయంలో నిపుణులు చెబుతున్న సమస్యలివీ..

1.అనొరెక్సియా నెర్వోసా
ఈ సమస్య వచ్చినవారు ఆహారం అంటేనే విరక్తి అన్నట్టుగా వ్యవహరిస్తుంటారు. ఆకలి వేసినా, వేయకున్నా.. కడుపు మాడ్చుకుంటారు. దీనివల్ల క్రమంగా విపరీతంగా బరువు తగ్గిపోతారు. శారీరకంగా తీవ్రంగా బలహీనంగా మారిపోతారు.

2.బులీమియా నెర్వోసా
తరచూ ఎక్కువగా ఆహారం తినే అలవాటు ఉండటం, లేదా ఎక్కడైనా తినాల్సి రావడం వల్ల.. దానికి తగినట్టుగా శక్తిని తగ్గించుకోవాలన్న ఆలోచన నుంచి ఈ సమస్య తలెత్తుతుంది. దీనితో ఆహారం తినడం తగ్గించుకోవడం, డైటింగ్ చేయడం, అతిగా వ్యాయామం చేయడం, బరువు తగ్గే మాత్రలు, మందులను వినియోగించడం పెరుగుతుంది.

3. బింగే ఈటింగ్ డిజార్డర్
 తరచూ అతిగా ఆహారం తీసుకునే అలవాటు కావడం ఈ సమస్యకు దారితీస్తుంది. రెండు, మూడు గంటల్లోనే రెండు సార్ల కన్నా ఎక్కువ సార్లు ఆహారం తీసుకోవడం ఈ డిజార్డర్ కిందికి వస్తుంది. ఏదైనా ఘటనతో అవమానంగా భావించి కుంగిపోయేవారు, ఒక ట్రాన్స్ వంటి మానసిక స్థితిలో ఉన్నవారు ఈ సమస్యకు లోనవుతారు. క్రమంగా అదే అలవాటై బరువు పెరిగిపోతారు.

4. పికా
కొందరు చిత్రమైన మానసిక సమస్య వల్ల ఎలాంటి పోషకాహార విలువలు లేని వాటిని తింటుంటారు. కొన్నిసార్లు ఆహారం కాని మంచు, మట్టి, చాక్ పీసులు, సబ్బులు, పేపర్, వెంట్రుకలు, వస్త్రం ముక్కలు వంటివి తినడం ‘పికా డిజార్డర్’ కిందికి వస్తుంది. మానసిక ఇబ్బందులతో బాధపడుతున్నవారిలో ఈ సమస్య కనిపిస్తుంది. దీనివల్ల అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతుంటాయి.

5.రుమినేషన్ డిజార్డర్
ఈ రకమైన ఆరోగ్య సమస్య తలెత్తిన వారిలో తిన్న ఆహారం తిరిగి పైకి ఎగదన్నుతుంటుంది. అందువల్ల వారు ఆహారాన్ని మళ్లీ మింగేయడమో, లేక బయటికి ఉమ్మేయడమో చేయాల్సి ఉంటుంది. దీనివల్ల శరీరానికి సరిగా ఆహారం అందక బలహీనంగా మారిపోతుంటారు.

6.అవాయిడెంట్/రిస్ట్రిక్టివ్ ఫుడ్ ఇన్ టేక్ డిజార్డర్ (ఏఆర్ఎఫ్ఐడీ)
ఇది కూడా అనెరొక్సియా వంటి సమస్యే. కాకపోతే బాధితులు కొన్ని రకాల ఆహారాన్ని తినడానికి ఇష్టపడరు. కొన్ని రకాల రంగులు, వాసన, రుచి ఉండే వాటికి దూరంగా ఉంటారు. అయితే ఇలాంటివి ఎక్కువ మొత్తంలో ఉంటాయి. దానితో తినే ఆహార పదార్థాల సంఖ్య తగ్గిపోయి.. శరీరానికి తగిన పోషకాలు అందవు. దీనితో బరువు తగ్గి, బలహీనంగా మారిపోతారు.

సమస్య ఏదైనా ఆరోగ్యానికి ఇబ్బందే..
  • ఆహారం తీసుకోవడంలో డిజార్డర్ ఏదైనా సరే.. బరువు తగ్గిపోవడంగానీ, బరువు పెరిగిపోవడం గానీ వచ్చి కొత్త అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. రోగ నిరోధక శక్తి తగ్గిపోతుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. పలుమార్లు శరీరంలో అవయవాలపైనా ప్రభావం పడి ప్రమాదకర పరిస్థితులూ తలెత్తుతాయని అంటున్నారు.
  • ఆహారం తీసుకోవడంలో సమస్యలు ఉన్నవారికి విడిగా గానీ, వారి కుటుంబ సభ్యులతో కలిసిగానీ మానసిక కౌన్సెలింగ్ ఇవ్వాల్సి ఉంటుంది.
  • ధ్యానం, యోగా వంటివి చేయడం ద్వారా కూడా ఇలాంటి సమస్యల నుంచి బయటపడొచ్చు.
  • తగిన ఆహారం అందని వారికి పోషకాహార నిపుణుల సలహాలతో తగిన ఆహారాన్ని ఇవ్వడం ద్వారా సమస్య నుంచి బయటపడేయొచ్చు.

  • Loading...

More Telugu News