Jubilee Hills: జూబ్లీహిల్స్ అత్యాచారం కేసు: మైనర్ నిందితులను మేజర్లుగా పరిగణించండి.. జువైనల్ జస్టిస్ బోర్డును కోరిన పోలీసులు
- నాంపల్లి కోర్టుకు, జువైనల్ జస్టిస్ బోర్డుకు చార్జ్‌షీట్ సమర్పించిన పోలీసులు
- తాము చేస్తున్నది తీవ్రనేరమని తెలిసీ అత్యాచారానికి ఒడిగట్టారన్న పోలీసులు
- ఇలాంటి ఘటనల్లో గత తీర్పులను ఉటంకించిన వైనం
- ఇటీవలే బెయిలుపై విడుదలైన నిందితులు
సంచలనం సృష్టించిన జూబ్లీహిల్స్ అత్యాచార కేసు నిందితులైన మైనర్లను మేజర్లుగా పరిగణించి విచారించాలంటూ జూబ్లీహిల్స్ పోలీసులు జువైనల్ జస్టిస్ బోర్డును కోరారు. ఈ మేరకు నాంపల్లి కోర్టుకు, జువైనల్ జస్టిస్ బోర్డుకు చార్జ్‌షీట్ సమర్పించారు. తాము చేస్తున్నది తీవ్ర నేరమని తెలిసినా నిందితులు ఏమాత్రం వెనక్కి తగ్గలేదని, బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని పోలీసులు అందులో పేర్కొన్నారు.
ఇలాంటి సందర్భాల్లో మైనర్లను మేజర్లుగా పరిగణిస్తూ గతంలో కోర్టులు ఇచ్చిన తీర్పులను కూడా అభియోగపత్రంలో పొందుపరిచారు. నేరం తీవ్రత దృష్ట్యా నిందితులైన ఐదుగురు మైనర్లను మేజర్లుగా పరిగణించి విచారణ చేయాలని జువైనల్ జస్టిస్ బోర్డును కోరారు. కాగా, నిందితులైన నలుగురు మైనర్లు ఇటీవల బెయిలుపై విడుదలయ్యారు. మరో నిందితుడైన సాదుద్దీన్ బెయిల్ పిటిషన్ హైకోర్టులో పెండింగ్‌లో ఉంది. జువైనల్ జస్టిస్ బోర్డు మంగళవారం నిందితులకు బెయిలు మంజూరు చేసింది. దీంతో అదే రోజు సాయంత్రం వారు జువైనల్ హోం నుంచి విడుదలయ్యారు.