Asia: రియల్టీ సంక్షోభంతో సగం సంపద నష్టపోయిన ఆసియా కుబేరురాలు
- చైనాలో రియల్ ఎస్టేట్ రంగంలో సంక్షోభం
- కంట్రీ గార్డెన్ హోల్డింగ్స్ షేరు సగం పతనం
- దీంతో యజమాని యాంగ్ హుయాన్ సంపదకు చిల్లు
- అయినా ఇప్పటికీ ఆమే ఆసియా కుబేరురాలు
ఆసియాలోనే సంపన్నురాలు ఆమె. వయసు 41 ఏళ్లే. కానీ, చైనాలో రియల్ ఎస్టేట్ సంక్షోభం వల్ల సగం సంపద ఆవిరైపోయింది. ఆమే చైనాకు చెందిన యాంగ్ హుయాన్. కంట్రీ గార్డెన్ హోల్డింగ్స్ అనే అతిపెద్ద రియల్ ఎస్టేట్ కంపెనీకి ఆమె యజమాని. తండ్రి యాంగ్ గోకియాంగ్ నుంచి ఆమెకు వారసత్వంగా ఈ వ్యాపారం వచ్చింది. ఈ ఏడాది ఇప్పటికే గార్డెన్ హోల్డింగ్స్ షేరు సగం పడిపోయింది.
ఇళ్ల ధరలు పడిపోవడం, ఆర్థిక మందగమనం కారణంగా కొనుగోలు శక్తి తగ్గిపోవడం, ఫలితంగా డిమాండ్ తగ్గడమే అక్కడి రియల్ ఎస్టేట్ పరిశ్రమలో సంక్షోభానికి కారణాలు. దీంతో బడా రియల్ ఎస్టేట్ సంస్థలు సైతం రుణాలు చెల్లించలేని పరిస్థితులకు చేరుకుంటున్నాయి. ఇక్కడ ఆశ్చర్యం ఏంటంటే.. ఈ ఏడాది ఇప్పటికే సగం సంపద తరిగిపోయినా.. యాంగ్ హుయాన్ ఇప్పటికీ ఆసియా సంపన్న మహిళగానే కొనసాగుతోంది. ఆమె సంపద విలువ సుమారు రూ.89,000 కోట్లు. దీంతో రెండో ఆసియా సంపన్నురాలు, చైనాకు చెందిన ఫాన్ హాంగ్వీ, యాంగ్ హుయాన్ మధ్య అంతరం 100 మిలియన్ డాలర్లకు తగ్గింది.