Team India: విండీస్‌పై టీ20ల్లోనూ అదే దూకుడు.. తొలి మ్యాచ్‌లో భారత్ ఘన విజయం

India Clinch 1st T20 against west indies

  • దినేశ్ కార్తీక్ మెరుపు ఇన్నింగ్స్
  • బ్యాటింగ్‌లో తేలిపోయిన విండీస్ 
  • 68 పరుగుల తేడాతో భారత్ విజయం 

మూడు వన్డేల సిరీస్‌లో విండీస్‌ను చిత్తు చేసిన భారత జట్టు టీ20ల్లోనూ అదే దూకుడు ప్రదర్శిస్తోంది. ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా ట్రినిడాడ్‌ టారౌబాలోని బ్రియాన్ లారా స్టేడియంలో గత రాత్రి జరిగిన సిరీస్ ఓపెనర్‌లో రోహిత్ సేన 68 పరుగుల తేడాతో విజయం సాధించి బోణీ కొట్టింది. 

టాస్ ఓడి బ్యాటింగ్ ప్రారంభించిన భారత్.. రోహిత్ శర్మ అర్ధ సెంచరీకితోడు దినేశ్ కార్తీక్ మెరుపు ఇన్నింగ్స్‌తో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 190 పరుగులు చేసింది. అనంతరం 191 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన విండీస్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 122 పరుగులు మాత్రం చేసి ఓటమి పాలైంది.

భారత బౌలర్లు పొదుపుగా బౌలింగ్ చేస్తూనే వికెట్లు రాబట్టడంతో విండీస్ ఏ దశలోనూ విజయం దిశగా సాగలేకపోయింది. ఆ జట్టులో ఓపెనర్ షమ్రా బ్రూక్స్ చేసిన 20 పరుగులే అత్యధికం. కైల్ మేయర్స్ 20, కెప్టెన్ పూరన్ 18, రోవ్‌మన్ పావెల్, షిమ్రన్ హెట్‌మయెర్ చెరో 14 పరుగులు చేశారు. అకీల్ హొసైన్ 11 పరుగులు చేయగా, కీమో పాల్ 19 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ఇండియన్ బౌలర్లలో అర్షదీప్ సింగ్, రవిచంద్రన్ అశ్విన్, రవి బిష్ణోయ్‌లకు చెరో రెండు వికెట్లు దక్కాయి. 

అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 190 పరుగుల భారీ స్కోరు సాధించింది. రోహిత్ శర్మ 44 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లతో 64 పరుగులు చేయగా, సూర్యకుమార్ యాదవ్ 24 పరుగులు చేసి వెనుదిరిగాడు. శ్రేయాస్ అయ్యర్ డకౌట్ కాగా, హార్దిక్ పాండ్యా ఒక్క సింగిల్ తీసి వెళ్లిపోయాడు. పంత్ (14), రవీంద్ర జడేజా కూడా బ్యాట్ ఝళిపించలేకపోయారు. 

అయితే, చివర్లో దినేశ్ కార్తీక్ మరోమారు జట్టుకు ఆపద్బాంధవుడయ్యాడు. 19 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 41 పరుగులు చేసి జట్టు భారీ స్కోరు సాధించడంలో సాయపడ్డాడు. అశ్విన్ 13 పరుగులు చేశాడు. ‘దినేశ్ కార్తీక్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. రెండో టీ20 సెయింట్ కిట్స్‌లో ఆగస్టు 1న జరుగుతుంది.

  • Loading...

More Telugu News