Panneerselvam: సుప్రీంకోర్టులో పన్నీర్ సెల్వంకు చుక్కెదురు
- ఈ నెల 11న జరిగిన అన్నాడీఎంకే సర్వసభ్యమండలి సమావేశం
- తనను ఈ సమావేశానికి పిలవలేదన్న పన్నీర్ సెల్వం
- మద్రాస్ హైకోర్టులోనే విషయం తేల్చుకోవాలన్న సుప్రీంకోర్టు
అన్నాడీఎంకే బహిష్కృత నేత పన్నీర్ సెల్వంకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. పార్టీ శాసననభాపక్ష నేత పళనిస్వామి అధ్యక్షతన ఈ నెల 11న నిర్వహించిన సర్వసభ్యమండలి సమావేశం చెల్లదంటూ ఉత్తర్వులు ఇవ్వాలని కోరుతూ పన్నీర్ సెల్వం వేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఈ సమావేశం చెల్లుతుందంటూ హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును ఆయన సుప్రీంకోర్టులో సవాల్ చేశారు.
ఈ పిటిషన్ పై నిన్న సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. ఇరువర్గాలకు చెందిన న్యాయవాదులు తమ వాదనలను వినిపించారు. అన్నాడీఎంకే పార్టీ నియమనిబంధనలను పళనిస్వామి పూర్తిగా ఉల్లంఘించారని ఈ సందర్భంగా పన్నీర్ సెల్వం తరపు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు.
ఈ సందర్భంగా ధర్మాసనం జోక్యం చేసుకుంటూ... పన్నీర్ సెల్వం, పళనిస్వామి వర్గాలు మళ్లీ ఒకే వర్గంగా వ్యవహరించే అవకాశం ఉందా? అని ప్రశ్నించింది. దీనికి సమాధానంగా కలిసే అవకాశం ఉందని ఒక వర్గం, ఏ మాత్రం అవకాశం లేదని మరో వర్గం న్యాయవాదులు తెలిపారు.
సర్వసభ్యమండలి సమావేశంలో ఎలాంటి నిబంధనలను ఉల్లంఘించలేదని... పార్టీలో సర్వసభ్యమండలికే సర్వాధికారాలు ఉంటాయని పళనిస్వామి తరపు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు తన నిర్ణయాన్ని వెలువరించింది. ఈ పిటిషన్ ను మళ్లీ మద్రాస్ హైకోర్టుకే పంపుతున్నామని... హైకోర్టు మూడు వారాల్లోగా విచారణ జరిపి తన నిర్ణయాన్ని ప్రకటించాలని ఆదేశించింది.