OnePlus 10T: ఆగస్ట్ లో విడుదల కానున్న ఆకర్షణీయ స్మార్ట్ ఫోన్లు ఇవే..!
- ఆగస్ట్ 3న వన్ ప్లస్ 10టీ
- ధర రూ.49,999 ఉండొచ్చని అంచనా
- ఆగస్ట్ 2న ఐక్యూ9టీ
- ఆగస్ట్ 10న శామ్ సంగ్ ఈవెంట్
- గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 4, గెలాక్సీ ఫోల్డ్ 4 విడుదల
భారత స్మార్ట్ ఫోన్ మార్కెట్ ఇప్పుడు అన్ని కంపెనీలనూ ఊరిస్తోంది. యాపిల్, శామ్ సంగ్ తోపాటు చైనా కంపెనీలు మార్కెట్ వాటా కోసం తెగ పోటీ పడుతుంటాయి. ఇందులో యాపిల్ ను మినహాయిస్తే.. మిగిలిన కంపెనీలు అన్నీ కూడా ఒక ఏడాదిలో ఎన్నో రకాల మోడల్స్ ను వినియోగదారుల ముందుకు తీసుకొస్తుండడం సర్వసాధారణంగా మారింది. ఈ క్రమంలో ఆగస్ట్ లో విడుదలయ్యే ఆసక్తికర ఫోన్ల వివరాలను పరిశీలిస్తే..
ఐక్యూ 9టీ
ఆగస్ట్ 2న ఈ ఫోన్ విడుదల అవుతుంది. ఇందులో 6.78 అంగుళాల అమోలెడ్ డిస్ ప్లే, 120 హెర్జ్ రీఫ్రెష్ రేటు, క్వాల్ కామ్ స్నాప్ గ్రాన్ 8 ప్లస్ జెనరేషన్ 1 చిప్ సెట్, 4,700 ఎంఏహెచ్ బ్యాటరీ, 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్, వెనుక ట్రిపుల్ కెమెరా సెటప్, ముందు భాగంలో 16 మెగాపిక్సల్ కెమెరా ఉంటాయి. దీని ధర రూ.49,999గా ఉండొచ్చని అంచనాలు ఉన్నాయి.
వన్ ప్లస్ 10టీ
ఆగస్ట్ 3న వన్ ప్లస్ 10టీ విడుదల కానుంది. దీనికి సంబంధించి కొన్ని వివరాలను సంస్థ వెల్లడించింది. 5జీ టెక్నాలజీని సపోర్ట్ చేసే ఈ ఫోన్లో స్నాప్ డ్రాగన్ 8ప్లస్ జెనరేషన్ 1 చిప్ సెట్ ఉంటుంది. 6.7 అంగుళాల అమోలెడ్ డిస్ ప్లేతో, 4,800 ఎంఏహెచ్ బ్యాటరీతో ఉండనుంది. దీనికి 150 వాట్ చార్జింగ్ సపోర్ట్ ఉంటుంది. వెనుక భాగంలో మూడు కెమెరాలు ఉంటాయి. అందులో మెయిన్ కెమెరా లెన్స్ 50 మెగాపిక్సల్ సోనీ ఐఎంఎక్స్ 766 ఉంటుంది. దీని ధర రూ.49,999గా ఉండొచ్చని తెలుస్తోంది.
శామ్ సంగ్ గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 4
శామ్ సంగ్ నుంచి ఈ ఫోల్డబుల్ ఫ్లాగ్ షిప్ ఫోన్ ఆగస్ట్ 10న విడుదల కానుంది. ఇందులో 6.7 అంగుళాల అమోలెడ్ డిస్ ప్లే ఉంటుంది. ఫోన్ ను మడతపెట్టినప్పుడు పైన 2.1 అంగుళాల అమోలెడ్ డిస్ ప్లే ఉంటుంది. 3,700 ఎంఏహెచ్ బ్యాటరీ, 25 వాట్ ఫాస్ట్ చార్జర్ తో రానుంది. ఇది కూడా క్వాల్ కామ్ స్నాప్ గ్రాన్ 8 ప్లస్ జెనరేషన్ 1 చిప్ సెట్ తోనే ఉంటుంది. వెనుక భాగంలో రెండు కెమెరాలు ఉంటాయి.
శామ్ సంగ్ గెలాక్సీ ఫోల్డ్ 4
ఆగస్ట్ 10న కార్యక్రమంలోనే శామ్ సంగ్ గెలాక్సీ ఫోల్డ్ 4ను కూడా ఆవిష్కరించనుంది. ఈ ఫోన్ ను తెరిచిప్పుడు డిస్ ప్లే 7.6 అంగుళాల పరిమాణంలో ఉంటుంది. ఇందులోనూ క్వాల్ కామ్ స్నాప్ గ్రాన్ 8 ప్లస్ జెనరేషన్ 1 చిప్ సెట్ ఏర్పాటు చేశారు. 120 గిగాహెర్జ్ రీఫ్రెష్ రేటుతో స్క్రీన్ ఉంటుంది.