Yasir.M: లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ ఇంజనీరింగ్ పట్టభద్రుడికి రూ.3 కోట్ల వేతనంతో కళ్లు చెదిరే ప్యాకేజీ
- 2018లో ఎల్పీయూలో బీటెక్ పూర్తిచేసిన యాసిర్
- యాసిర్ ను ఎంపిక చేసుకున్న బహుళజాతి కంపెనీ
- జర్మనీలో ఉద్యోగం
భారతీయ విద్యార్థులు పలు అంతర్జాతీయ సంస్థల్లో భారీ వేతనంతో కొలువులు సంపాదించడం తెలిసిందే. ఈ క్రమంలో, లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ (ఎల్పీయూ)లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన ఓ విద్యార్థి కళ్లు చెదిరే వేతనంతో భారీ ప్యాకేజీ సొంతం చేసుకున్నాడు. ఆ విద్యార్థి పేరు యాసిర్. 2018లో అతడు ఎల్పీయూలో సీఎస్ఈ విభాగంలో బీటెక్ పూర్తిచేశాడు. ఆ తర్వాత ఎలాంటి విద్యాకోర్సుల్లో చేరని అతడు ఉద్యోగ ప్రయత్నాల్లో భాగంగా బంపర్ బొనాంజా దక్కించుకున్నాడు.
కరోనా సమయంలో ప్రపంచవ్యాప్తంగా విశిష్ట సేవలు అందించిన ఓ బహుళజాతి కంపెనీలో రూ.3 కోట్ల వార్షిక వేతనంతో జర్మనీలో ఉద్యోగం పొందాడు. ఎల్పీయూ క్యాంపస్ లో పటిష్ఠమైన విద్యావిధానం ద్వారానే తాను మెరుగైన ఉద్యోగం పొందగలిగానని యాసిర్ చెబుతున్నాడు. యాసిర్ కేరళకు చెందినవాడు. 8.6 సీజీపీఏ స్కోరుతో అతడు బీటెక్ పూర్తిచేశాడు. యూనివర్సిటీలో చదువుతున్న సమయంలో అనేక సాంకేతిక సదస్సుల్లో తన ప్రతిభ చాటాడు.
యాసిర్ ఒక్కడే కాదు, ఎల్పీయూలో చదివిన పలువురు గూగుల్, ఆపిల్, మైక్రోసాఫ్ట్, మెర్సిడెస్ వంటి ఫార్చూన్-500 కంపెనీల్లో కోటి రూపాయలకు పైగా వార్షిక వేతనంతో ఉద్యోగాలు పొందారు. ఇటీవలే హరేకృష్ణ మాతో అనే బీటెక్ విద్యార్థి గూగుల్ బెంగళూరు క్యాంపస్ లో రూ.64 లక్షల వేతనంతో ఉద్యోగంలో చేరాడు.