Bhuma Akhila Priya: తండ్రి అమ్మేసిన భూమిలో వాటా కోసం కోర్టుకెక్కిన భూమా జగత్ విఖ్యాత్ రెడ్డి
- మంచిరేవులలో శోభానాగిరెడ్డి పేరిట వెయ్యి గజాల స్థలం
- శోభానాగిరెడ్డి చనిపోయాక ఆ భూమిని విక్రయించిన నాగిరెడ్డి
- నాడు మైనర్‌గా ఉన్న జగత్‌తో వేలి ముద్ర వేయించిన వైనం
- నేడు మేజర్ అయిన తనకు అందులో వాటా ఇప్పించాలంటున్న జగత్
- కొనుగోలుదారులతో పాటు తన ఇద్దరు అక్కలను ప్రతివాదులుగా చేర్చిన వైనం
దివంగత భూమా నాగిరెడ్డి, శోభా నాగిరెడ్డిల కుటుంబానికి చెందిన మరో వివాదం తెలంగాణ హైకోర్టుకు చేరింది. తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండలం మంచిరేవుల పరిధిలో తన తల్లి పేరిట ఉన్న 1,000 గజాల స్థలంలో తనకు వాటా ఇప్పించాలంటూ భూమా దంపతుల కుమారుడు భూమా జగత్ విఖ్యాత్ రెడ్డి తాజాగా తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో ప్రతివాదులుగా ఆ భూమిని కొనుగోలు చేసిన ఐదుగురు వ్యక్తులతో పాటు తన ఇద్దరు అక్కలు భూమా అఖిలప్రియ, భూమా మౌనికలను చేర్చారు. తోడబుట్టిన అక్కలను ఆయన తన పిటిషన్‌లో ప్రతివాదులుగా చేర్చడం గమనార్హం.
ఈ భూమి వివరాల్లోకెళితే... భూమా శోభా నాగిరెడ్డి బతికుండగా... భూమా ఫ్యామిలీ ఆమె పేరిటే ఈ భూమిని కొనుగోలు చేసింది. అయితే శోభానాగిరెడ్డి చనిపోయాక ఆమె భర్త నాగిరెడ్డి ఆ భూమిని 2016లో వేరే వాళ్లకు విక్రయించారు. ఈ సందర్భంగా అప్పటికే మేజర్లు అయిన తన ఇద్దరు కుమార్తెలతో పాటు తాను సంతకం చేయగా, అప్పటికి ఇంకా మైనారిటీ తీరని తన కుమారుడితో వేలి ముద్ర వేయించారు. ఈ విక్రయం ముగిసిన కొన్నాళ్లకే నాగిరెడ్డి కూడా మరణించిన సంగతి తెలిసిందే. అయితే నాడు భూమిని కేవలం రూ.2 కోట్లకు విక్రయిస్తే... ఇప్పుడు దాని విలువ రూ.6 కోట్లకు చేరినట్లుగా తెలుస్తోంది.
ఈ క్రమంలో తన తల్లి చనిపోయాక ఆ భూమిని విక్రయించారని, దీంతో ఆ విక్రయం చెల్లదంటూ భూమా జగత్ విఖ్యాత్ రెడ్డి తన ఇద్దరు అక్కలతో కలిసి ఇదివరకే కింది కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా... ఆ పిటిషన్‌లో ఆయనకు వ్యతిరేకంగా కోర్టు తీర్పు ఇచ్చిందట. అయితే ఇప్పుడు తాను మైనర్‌గా ఉన్నప్పుడు ఆ భూమిని విక్రయించారని, ఇప్పుడు తాను మేజర్ నని, ఈ నేపథ్యంలో తనకూ ఆ భూమిలో వాటా ఇప్పించాలని కోరుతూ తాజాగా ఆయన నేరుగా తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై కోర్టు ఎలాంటి నిర్ణయాన్ని వెలువరిస్తుందన్న దానిపై ఆసక్తి నెలకొంది.