Mahua Moitra: సస్పెండైన ఎంపీలు గాంధీ విగ్రహం వద్ద తందూరీ చికెన్ లాగిస్తున్నారంటూ వివాదం... ఎంపీ మహువా మొయిత్రా స్పందన
- కొనసాగుతున్న పార్లమెంటు వర్షాకాల సమావేశాలు
- సస్పెండైన 24 మంది సభ్యులు
- గాంధీ విగ్రహం వద్ద ఆందోళన
- అక్కడే అన్నపానీయాలు, నిద్ర!
- తందూరీ చికెన్ తింటున్నారని బీజేపీ ఆరోపణలు
పార్లమెంటు వర్షాకాల సమావేశాల సందర్భంగా ఉభయసభల్లో విపక్ష సభ్యులు ధరల పెరుగుదల తదితర అంశాలపై ఎలుగెత్తగా, 24 మంది సస్పెన్షన్ కు గురయ్యారు. అయితే, సస్పెన్షన్ ను నిరసిస్తూ విపక్ష ఎంపీలు పార్లమెంటులోని గాంధీ విగ్రహం వద్ద ఆందోళనలు నిర్వహిస్తున్నారు. అక్కడే భోజనం చేస్తూ, అక్కడే నిద్రిస్తున్నారు. అయితే, విపక్ష ఎంపీలు గాంధీ విగ్రహం వద్ద తందూరీ చికెన్ తింటున్నారంటూ బీజేపీ సభ్యులు మండిపడుతున్నారు. దీనిపై తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా స్పందించారు.
బీజేపీ సభ్యులు తందూరీ చికెన్ వివాదాన్ని పక్కనబెట్టి, గాంధీ మహాత్ముడి ఆశయాలకు కలుగుతున్న నష్టంపై దృష్టి సారించాలని హితవు పలికారు. అధికారపక్షం దీని గురించి ఆలోచిస్తే బాగుంటుందని పేర్కొన్నారు. గాంధీ విగ్రహం వద్ద చికెన్ తింటే కలిగే నష్టం కంటే... అహింస, సత్యం, స్వావలంబన, నిరాడంబరత వంటి గాంధీ ప్రవచించిన ఆదర్శాలకు ప్రస్తుత పాలనలో మరింత ముప్పు ఏర్పడిందని అన్నారు.
గాంధీ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా కొన్ని సంఘటనలు జరుగుతున్నాయంటూ యూపీలో బుల్డోజర్ తో కూల్చివేతల ఉదంతాలను ప్రస్తావించారు. అహింస అంటూనే, యూపీలో యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఇలాంటి చర్యలకు ప్రసిద్ధికెక్కిందని మహువా మొయిత్రా విమర్శించారు.
గాంధీ పేర్కొన్న సత్యాన్ని తుంగలో తొక్కుతూ... 2014 ఎన్నికల వేళ ప్రతి ఒక్కరి ఖాతాలో రూ.15 లక్షలు జమ చేస్తామన్న హామీని విస్మరించారని ఆరోపించారు. స్వావలంబన అంశంపై స్పందిస్తూ, సమాఖ్య స్ఫూర్తికి తూట్లు పొడుస్తున్నారని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇక నిరాడంబరత అంశంపై స్పందిస్తూ, ప్రధాని మోదీ ధరించిన రూ.10 లక్షల సూట్ అంశాన్ని ఎత్తిచూపారు. గాంధీ సిద్ధాంతాలకు ఇంత హాని జరుగుతుంటే బీజేపీ ఎంపీలు తందూరీ చికెన్ వివాదాన్ని రేకెత్తిస్తున్నారని మండిపడ్డారు.