BJP: ప్రతి ఇంటిపై జాతీయ జెండాతో స్ఫూర్తిని చాటుదాం: కిషన్ రెడ్డి
- హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని విజయవంతం చేసుకుందామని కేంద్ర మంత్రి పిలుపు
- పింగళి వెంకయ్య జయంతి సందర్భంగా ఢిల్లీలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు వెల్లడి
- పింగళి వెంకయ్య కుటుంబ సభ్యులను ప్రధాని మోదీ కలవనున్నారని ప్రకటన
కేంద్ర ప్రభుత్వం హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని విజయవంతం చేద్దామని.. జాతీయ పతాక స్ఫూర్తిని బలంగా చాటుదామని కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ లో భాగంగా ఆగస్టు 15న ప్రతి ఇంటిపైనా జాతీయ జెండా ఎగురవేయాలని కోరారు. ఆగస్టు 3న ఢిల్లీలో తిరంగా యాత్ర చేపడతామని.. 9వ తేదీ నుంచి 13వ తేదీ వరకు ప్రభాత భేరీల పేరిట ప్రతి పల్లె, పట్టణాల్లో కార్యక్రమాలు నిర్వహించాలని అందరినీ కోరామని తెలిపారు. దేశ విభజన సమయంలో ప్రాణాలు కోల్పోయిన వారికి ఆగస్టు 14న శ్రద్ధాంజలి ఘటిస్తూ కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహిస్తామని తెలిపారు.
పింగళి జయంతికి ప్రత్యేక కార్యక్రమాలు
జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య జయంతి సందర్భంగా ఆగస్టు 2న ఢిల్లీలో ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నట్టు కిషన్ రెడ్డి వెల్లడించారు. పింగళి రూపొందించిన జాతీయ జెండాను ప్రదర్శిస్తామని.. ఆయన స్మారకార్థం ప్రత్యేక పోస్టల్ స్టాంపును ఆవిష్కరిస్తామని తెలిపారు. పింగళి కుటుంబ సభ్యులతో ప్రధాని మోదీ భేటీ కానున్నారని వివరించారు. ఇక పింగళి వెంకయ్యకు భారతరత్న ఇవ్వాలనే డిమాండ్ ఉందని.. దానిని పరిశీలించి తగిన నిర్ణయం తీసుకుంటామని కిషన్ రెడ్డి తెలిపారు.