Taneti Vanita: అనంతపురంలో రీజనల్ ఫోరెన్సిక్ ల్యాబ్ ప్రారంభించిన హోంమంత్రి తానేటి వనిత, డీజీపీ
- క్రిమినల్ కేసుల దర్యాప్తులో ఫోరెన్సిక్ ఫలితాలే కీలకమన్న వనిత
- ఏపీలో ఫ్రెండ్లీ పోలీసింగ్ అమలవుతోందని వెల్లడి
- పోలీసులు క్షణాల్లో స్పందిస్తున్నారని వివరణ
- లోన్ యాప్ ఆగడాలను సీఎం దృష్టికి తీసుకెళతానని వెల్లడి
అనంతపురంలో ఏర్పాటైన రీజనల్ ఫోరెన్సిక్ ల్యాబ్ ను ఏపీ హోంమంత్రి తానేటి వనిత, రాష్ట్ర డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా హోంమంత్రి తానేటి వనిత మాట్లాడుతూ, క్రిమినల్ కేసులు ఛేదించడంలో ఫోరెన్సిక్ ఫలితాలే కీలకమని అన్నారు. ఏపీలో ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానం అమలవుతోందని చెప్పారు. ఎక్కడ, ఎలాంటి ఘటన జరిగినా పోలీసులు క్షణాల్లో స్పందించేలా వ్యవస్థలో మార్పు తెచ్చామని వివరించారు. సీఎం జగన్ కృషి వల్లే దిశ చట్టం తెచ్చామని వెల్లడించారు. ముఖ్యమంత్రి ఆదేశాలతోనే రాష్ట్రవ్యాప్తంగా ఫోరెన్సిక్ ల్యాబ్ లు ఏర్పాటు చేస్తున్నట్టు స్పష్టం చేశారు.
అటు, లోన్ యాప్ నిర్వాహకుల ఆగడాలపైనా హోంమంత్రి స్పందించారు. లోన్ యాప్ ల వేధింపుల వ్యవహారాన్ని సీఎం జగన్ దృష్టికి తీసుకెళతానని తెలిపారు. రుణాలు తీసుకున్నవారి మొబైల్ డేటా సాయంతో వేధింపులకు పాల్పడడం నేరం అని స్పష్టం చేశారు. వేధింపులకు పాల్పడే లోన్ యాప్ నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.