Harmanpreet Kaur: ధోనీ రికార్డును బ్రేక్ చేసిన హర్మన్‌ప్రీత్ కౌర్

Harmanpreet Kaur Overtakes MS Dhoni Record in T20I
  • టీ20ల్లో కెప్టెన్‌గా 42 విజయాలు 
  • 41 విజయాలు సాధించిన ధోనీ
  • కామన్వెల్త్ గేమ్స్‌లో బార్బడోస్‌పై గెలిస్తే హర్మన్ సేనకు సెమీస్ బెర్త్ ఖరారు
టీమిండియా మహిళా జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ అత్యంత అరుదైన ఘనత సాధించింది. కెప్టెన్‌గా టీ20ల్లో అత్యధిక విజయాలు అందించిన భారత క్రికెటర్‌గా రికార్డులకెక్కింది. ఈ క్రమంలో టీమిండియా మాజీ సారథి మహేంద్రసింగ్ ధోనీ రికార్డును బద్దలుగొట్టింది. 

కామన్వెల్త్ గేమ్స్‌లో భాగంగా నిన్న చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో హర్మన్‌సేన ఘన విజయం సాధించింది. కెప్టెన్‌గా హర్మన్‌కు ఇది 42వ టీ20 విజయం. ఇప్పటి వరకు 71 మ్యాచ్‌లకు సారథ్యం వహించిన హర్మన్ 42 మ్యాచుల్లో జట్టుకు విజయాన్ని అందించింది. 26 మ్యాచుల్లో జట్టు ఓటమి పాలైంది. మూడింటిలో ఫలితం తేలలేదు. 

ధోనీ 72 టీ20 మ్యాచుల్లో కెప్టెన్‌గా వ్యవహరించాడు. అతడి సారథ్యంలోని టీమిండియా 41 మ్యాచుల్లో విజయం సాధించి 28 మ్యాచుల్లో ఓటమి పాలైంది. ఒకటి టై కాగా, మరో రెండు గేముల్లో ఫలితం తేలలేదు. అలాగే, మరో మాజీ సారథి విరాట్ కోహ్లీ భారత్‌కు 50 టీ20 మ్యాచుల్లో సారథ్యం వహించాడు. 30 మ్యాచుల్లో జట్టుకు విజయాన్ని అందించాడు. 16 మ్యాచుల్లో పరాజయం ఎదురైంది. రెండు మ్యాచ్‌లు టై కాగా, మరో రెండింటిలో ఫలితం తేలలేదు.

కామన్వెల్త్ గేమ్స్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి మ్యాచ్‌లో పరాజయం పాలైన అమ్మాయిులు.. నిన్న బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో రాణించి పాకిస్థాన్‌పై అద్వితీయ విజయాన్ని అందుకున్నారు. బుధవారం బార్బడోస్‌తో జరిగే మ్యాచ్‌లో అమ్మాయిలు విజయం సాధిస్తే సెమీస్‌లోకి దూసుకెళ్తుంది.
Harmanpreet Kaur
Team India
MS Dhoni
Virat Kohli

More Telugu News