Employee: ఉద్యోగం నుంచి తీసేశారని కంపెనీ బిల్డింగును కూలగొట్టాడు.. వీడియో ఇదిగో
- కెనడాలోని ఒంటారియో నగరంలో ఘటన
- చుట్టు పక్కల భవనాలు కూడా స్వల్పంగా దెబ్బతిన్న వైనం
- అతడిని ఎందుకు తొలగించారో తెలియదన్న స్థానికులు
- నష్టం కోట్ల రూపాయల్లోనే ఉంటుందని అంచనా
- కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్
అతనో సీనియర్ ఉద్యోగి.. చాలా ఏళ్లుగా ఓ కంపెనీలో పనిచేస్తున్నాడు.. ఇటీవలే ఏదో కారణంగా ఉద్యోగంలోంచి తొలగించారు.. దీనిపై ఆగ్రహం పెంచుకున్న అతను.. ఓ ఎక్స్ కవేటర్ తీసుకుని వచ్చాడు. అంతకాలం తాను పనిచేసిన ఆఫీసు బిల్డింగ్ నే కూల్చివేయడం మొదలుపెట్టాడు. అసలే కలపతో కట్టిన భవనం.. తుక్కు తుక్కు అవడం మొదలైంది.
కెనడాలోని ఒంటారియో నగరంలో ముస్కోసా సరస్సు ఒడ్డున ఉన్న ‘ప్రైడ్ ఆఫ్ రోస్సూ మెరీనా’ కంపెనీలో పనిచేసిన ఉద్యోగి వ్యవహారమిది. పక్కనే ఉన్న సరస్సులో బోట్ లో వెళుతున్న కొందరు ఈ దృశ్యాన్ని వీడియో తీశారు. ఇప్పుడా వీడియో వైరల్ గా మారింది.
‘‘కంపెనీ నుంచి తొలగించిన ఆగ్రహంతో ఓ మాజీ ఉద్యోగి ప్రైడ్ మెరీనా భవనాన్ని ఎక్స్ కవేటర్ తో కూల్చివేశాడు. నష్టం మిలియన్ డాలర్లలో ఉంటుంది. అదృష్టవశాత్తు ఎవరూ గాయపడలేదు. ఇదేదో ఫిక్షన్ లా అనిపిస్తోంది..” అని వీడియోను పోస్ట్ చేసిన స్థానికుడు పేర్కొన్నారు.
కోట్లలో నష్టం వచ్చిందన్న స్థానికులు
ప్రైడ్ మెరీనా గ్రూప్ కంపెనీ కెనడాలో బోటింగ్ సర్వీసులను నిర్వహిస్తుంటుంది. సరస్సు ఒడ్డున ఈ భవనం ఉన్న ప్రాంతం చాలా ఖరీదైనదని.. అందువల్ల నష్టం కోట్లలో ఉంటుందని స్థానికులు పేర్కొన్నారు. ఎక్స్ కవేటర్ తీసుకొస్తున్న సమయంలో, ప్రైడ్ మెరీనా భవనాన్ని కూలగొడుతున్నప్పుడు పక్కనున్న ఇతర నిర్మాణాలూ కొంత దెబ్బతిన్నాయని తెలిపారు. ఇక భవనం కూలగొడుతున్న విషయం తెలుసుకుని ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు.. 59 ఏళ్ల మాజీ ఉద్యోగిని అరెస్టు చేశారు. అయితే ఆయన పేరు, ఇతర వివరాలు, కంపెనీ ఉద్యోగంలోంచి ఎందుకు తొలగించింది అనే వివరాలను వెల్లడించలేదు.