Bal Aadhaars: 1.6 కోట్ల ‘బాల ఆధార్’లు జారీ
- పుట్టిన తేదీ సర్టిఫికెట్ తో పాటే ఆధార్ నంబర్
- ఐదేళ్లు నిండిన తర్వాత వేలి ముద్రలతో అప్ డేషన్
- ప్రభుత్వ పథకాల ప్రయోజనాలకు అర్హుల ఎంపిక సులభం
పాఠశాలల్లోకి చేరని బాలలకు సైతం ఆధార్ కార్డులు జారీ చేయాలన్న కేంద్ర ప్రభుత్వ ప్రయత్నం ఫలితాలను ఇస్తోంది. ఇప్పటి వరకు 1.6 కోట్ల మంది బాలలకు ఆధార్ కార్డులు జారీ అయినట్టు అధికార వర్గాలు వెల్లడించాయి. స్కూల్ లో చేరడానికి ముందే ప్రయోజనాల విషయంలో అర్హులను గుర్తించేందుకు బాల ఆధార్ స్కీమ్ ఉపయోగపడుతుందని తెలిపాయి. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ప్రయోగాత్మకంగా ఈ పథకాన్ని పరీక్షించి చూడగా, మంచి ఫలితాలు వచ్చినట్టు చెప్పాయి.
బాలలకు ఆధార్ కార్డుల జారీ కోసం యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యూఐడీఏఐ) రిజిస్ట్రార్ జనరల్స్ తో ఒప్పందం చేసుకుంది. దీని కింద పుట్టిన తేదీ సర్టిఫికెట్ జారీ చేసే సమయంలోనే ఆధార్ నంబర్ కూడా మంజూరు చేస్తారు. ‘‘పుట్టిన వెంటనే వారికి ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది. స్కూల్ కు రావడానికి ముందే వారు ఏవైనా ప్రయోజనాలకు అర్హులేమో గుర్తించేందుకు వీలుంటుంది. పలు ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు వారికి అందేలా చూడొచ్చు’’ అని ఓ అధికారి తెలిపారు. అన్ని రకాల రిజిస్ట్రేషన్లకు, పాఠశాలల్లో అడ్మిషన్లకు ఆధార్ ప్రామాణికంగా ఉంటుందని తెలిసిందే.