Parliament: పార్లమెంటులో రగడ... ధరల పెరుగుదలపై నేడు కూడా విపక్షాల ఆందోళనలు
- కొనసాగుతున్న పార్లమెంటు వర్షాకాల సమావేశాలు
- కేంద్రాన్ని నిలదీస్తున్న విపక్షాలు
- ఉభయ సభల్లో వాయిదాల పర్వం
- విపక్ష సభ్యుల నినాదాలతో గందరగోళం
- నేడు కూడా పలుమార్లు వాయిదా
ధరల పెరుగుదల అంశంపై విపక్షాలు కేంద్రాన్ని మరోసారి నిలదీశాయి. ధరల పెరుగుదల అంశంపై విపక్ష సభ్యుల ఆందోళనలతో రాజ్యసభలో మరోసారి గందరగోళం ఏర్పడింది. ఇదే కారణంతో జులై 29న రాజ్యసభను నేటికి వాయిదా వేశారు.
అయితే, ఇవాళ ఉదయం 11 గంటలకు సభ ప్రారంభం కాగా, కాంగ్రెస్ సభ్యులు ధరల పెరుగుదల అంశంపై చర్చకు పట్టుబట్టారు. దాంతో సభ కొనసాగే అవకాశం కనిపించకపోవడంతో మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు. అనంతరం రాజ్యసభ తిరిగి ప్రారంభం కాగా, కాంగ్రెస్ సభ్యులు నినాదాలతో హోరెత్తించారు. ఈ నేపథ్యంలో, సభను మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేశారు.
అటు, లోక్ సభలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. విపక్ష సభ్యుల నినాదాలతో గందరగోళం ఏర్పడడంతో సభ రెండుసార్లు వాయిదా పడింది. అరకు ఎంపీ గొడ్డేటి మాధవి సాంకేతిక విద్యపై ప్రశ్న అడుగుతున్న సమయంలో సభ ముందుకు నడిచే అవకాశం లేకపోవడంతో స్పీకర్ ఓం బిర్లా సభను 12 గంటల వరకు వాయిదా వేశారు. తిరిగి ప్రారంభమైనా, అవే పరిస్థితులు పునరావృతం అయ్యాయి. దాంతో సభను మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేశారు.