Husnabad: గౌరవెల్లి ప్రాజెక్టు ట్రయల్ రన్ సక్సెస్... మోటార్లను ఆన్ చేసి, నీటిని వదిలిన హుస్నాబాద్ ఎమ్మెల్యే
- హుస్నాబాద్ సాగు నీటి కోసమే గౌరవెల్లి ప్రాజెక్టు
- రూ.770 కోట్లతో ప్రాజెక్టును నిర్మించిన ప్రభుత్వం
- ఈ ప్రాజెక్టు ద్వారా 1.06 లక్షల ఎకరాలకు సాగు నీరు
- రిజర్వాయర్‌లోకి నీటిని విడుదల చేసిన సతీశ్ కుమార్
సాగు నీటి ప్రాజెక్టులతో కళకళలాడుతున్న తెలంగాణలో మరో కొత్త ప్రాజెక్టు అందుబాటులోకి వచ్చింది. సిద్దిపేట జిల్లా పరిధిలోని హుస్నాబాద్ నియోజకవర్గ పరిధిలోని 1.06 లక్షల ఎకరాలకు సాగు నీరు అందించేందుకు ఉద్దేశించిన గౌరవెల్లి ప్రాజెక్టు ట్రయల్ రన్ సోమవారం విజయవంతంగా ముగిసింది. స్థానిక ఎమ్మెల్యే వొడితెల సతీశ్ కుమార్ ప్రాజెక్టు మోటార్లను ఆన్ చేసి రిజర్వాయర్‌లోకి నీటిని వదిలారు.
ఏళ్ల తరబడి సాగు నీటి కోసం ఎదురు చూస్తున్న హుస్నాబాద్ రైతుల కష్టాలను తీర్చే దిశగా చర్యలు చేపట్టిన తెలంగాణ ప్రభుత్వం గౌరవెల్లి ప్రాజెక్టుకు రూపకల్పన చేసింది. ఈ ప్రాజెక్టు కోసం ఏకంగా రూ.770 కోట్లను వెచ్చించింది. ప్రాజెక్టు పనులు పూర్తయిన నేపథ్యంలో సోమవారం అధికారులు ట్రయల్ రన్ నిర్వహించారు. త్వరలోనే ఈ ప్రాజెక్టు ద్వారా రిజర్వాయర్‌ను నింపనున్న అధికారులు... రిజర్వాయర్ నుంచి నీటిని పంట పొలాలకు తరలించనున్నారు.