Congress MPs: ఓ వార్నింగ్ ఇచ్చి నలుగురు కాంగ్రెస్ సభ్యులపై సస్పెన్షన్ ను ఎత్తివేసిన లోక్ సభ స్పీకర్
- గత నెలలో ప్రారంభమైన పార్లమెంటు వర్షాకాల సమావేశాలు
- ప్లకార్డులు, నినాదాలతో కాంగ్రెస్ సభ్యుల నిరసనలు
- నలుగురు కాంగ్రెస్ ఎంపీలపై సస్పెన్షన్ వేటు
- నేడు అఖిలపక్ష సమావేశం నిర్వహించిన స్పీకర్
పార్లమెంటు వర్షాకాల సమావేశాల ఆరంభంలో ప్లకార్డులు, నినాదాలతో నిరసన వ్యక్తం చేసిన కాంగ్రెస్ ఎంపీలు మాణికం ఠాగూర్, రమ్యా హరిదాస్, జోతిమణి, టీఎన్ ప్రతాపన్ లు జులై 25న సస్పెన్షన్ కు గురికావడం తెలిసిందే. వారిపై పార్లమెంటు సమావేశాలు ముగిసేవరకు బహిష్కరణ విధించారు. అయితే, ఆ నలుగురు కాంగ్రెస్ ఎంపీలపై సస్పెన్షన్ ఎత్తివేస్తున్నట్టు లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా నేడు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆ నలుగురు ఎంపీలకు హెచ్చరిక చేశారు. పార్లమెంటులో ఎలాంటి అనుచిత ప్రవర్తనకు పాల్పడవద్దని స్పష్టం చేశారు.
ఈ ఉదయం లోక్ సభ కార్యకలాపాలు ప్రారంభించక ముందు ఓం బిర్లా అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. సభలో జరిగిన పరిణామాలపై ప్రతి ఒక్కరి మనోభావాలు గాయపడ్డాయని, తాను కూడా వేదనకు గురయ్యానని ఓం బిర్లా తెలిపారు. దేశంలో అత్యున్నత ప్రజాస్వామ్య వ్యవస్థ పార్లమెంటు అని, పార్లమెంటరీ సంప్రదాయంలో పాలుపంచుకుంటున్నందుకు మనమందరం గర్వించాలని పేర్కొన్నారు. సభా మర్యాద, హుందాతనం కాపాడడం మనందరి సమష్టి బాధ్యత అని స్పష్టం చేశారు.