Conjoined Twins: బ్రెజిల్ అవిభక్త కవలలకు శస్త్రచికిత్స విజయవంతం

Doctors successfully separates Brazilian conjoined twins

  • తలలు అతుక్కుని జన్మించిన అబ్బాయిలు
  • మెదళ్లు కూడా కలిసిపోయిన వైనం
  • ఏడు శస్త్రచికిత్సలు చేసిన వైద్యులు
  • చివరి రెండు సర్జరీలకే 33 గంటల సమయం
  • కోలుకుంటున్న చిన్నారులు

బ్రెజిల్ లో తలలు అతుక్కుని జన్మించిన కవలలను విజయవంతంగా వేరుచేశారు. బ్రిటన్ కు చెందిన చిన్నపిల్లల వైద్యనిపుణుడు డాక్టర్ నూర్ ఉల్ ఖ్వాసీ జిలానీ నేతృత్వంలో నిర్వహించిన ఈ శస్త్రచికిత్స విజయవంతమైంది. ఆ అబ్బాయిల పేర్లు బెర్నార్డో లిమా, ఆర్థర్ లిమా. వారి వయసు నాలుగేళ్లు. జన్మతః వారి తలలు అతుక్కుని ఉండడమే కాదు, వారి మెదళ్లు కూడా ఒకదానితో ఒకటి కలిసిపోయాయి. దాంతో, వారిని విడదీయడం అత్యంత సంక్లిష్టమైన వ్యవహారంగా మారింది. 

అయితే, డాక్టర్ నూర్ బృందం 7 శస్త్రచికిత్సలు నిర్వహించి ఆ చిన్నారులకు కొత్త జీవితాన్ని ప్రసాదించింది. చివరి రెండు శస్త్రచికిత్సలకే 33 గంటల సమయం పట్టిందంటే వైద్యబృందం ఎంత శ్రమించిందో అర్థంచేసుకోవచ్చు. ఈ మహాక్రతువులో దాదాపు 100 మంది వైద్యసిబ్బంది పాలుపంచుకున్నారు. 

తలలే కాదు, ఇలా మెదళ్లు కూడా కలిసిపోయి జన్మించిన వారిని వైద్య పరిభాషలో క్రేనియోపాగస్ ట్విన్స్ అంటారు. వీరిని విడదీయడం ఒక్కోసారి ప్రాణాంతకం అవుతుంది. దాంతో, డాక్టర్ నూర్, ఇతర సర్జన్లు నెలల తరబడి వర్చువల్ విధానంలో పలు శస్త్రచికిత్స మెళకువలను సాధన చేశారు. ఆ చిన్నారులను ఎలా విడదీయాలన్న దానిపై సంపూర్ణమైన అవగాహన వచ్చాకే సుదీర్ఘమైన శస్త్రచికిత్స ప్రక్రియ ప్రారంభించారు. 

రియో డి జెనీరో నగరంలో చేపట్టిన ఆ సర్జరీని బ్రెజిల్ వైద్య సంస్థ అధిపతి డాక్టర్ గాబ్రియెల్ ముఫార్రెజ్ తో కలిసి డాక్టర్ నూర్ పర్యవేక్షించారు. ప్రస్తుతం ఆ బాలురు ఇద్దరూ ఆసుపత్రిలో కోలుకుంటున్నారు. వారిని ఆరు నెలల పాటు పరిశీలనలో ఉంచనున్నారు.
.

  • Loading...

More Telugu News