Farmani Naaz: 'హర్ హర్ శంభు' అంటూ భక్తిగీతాన్ని ఆలపించిన ముస్లిం గాయనిపై ఆగ్రహావేశాలు!
- ఇటీవలే శ్రావణమాసం ఆరంభం
- శివుడిపై భక్తిగీతాన్ని పాడిన గాయని ఫర్మానీ నాజ్
- తన యూట్యూబ్ చానల్ లో పోస్ట్ చేసిన వైనం
- ముస్లిం సంఘాల నుంచి తీవ్ర వ్యతిరేకత
ఉత్తరప్రదేశ్ లోని ముజఫర్ నగర్ కు చెందని ఫర్మానీ నాజ్ ఓ గాయని. ఓ కుమారుడు పుట్టిన తర్వాత భర్త నిరాదరణకు గురైంది. దాంతో కొడుకుతో కలిసి జీవిస్తూ యూట్యూబ్ ను ఆదాయ వనరుగా మార్చుకుంది. పాటలు పాడి వాటిని యూట్యూబ్ లో పోస్టు చేస్తుంది. ఫర్మానీ నాజ్ ఏదో మామూలు యూట్యూబర్ అనుకుంటే పొరబడినట్టే. ఆమె యూట్యూబ్ ఖాతాకు 30 లక్షల మందికి పైగా సబ్ స్క్రయిబర్లు ఉన్నారు.
అయితే, ఆమె ఇటీవల పాడిన ఓ పాట వివాదాస్పదమైంది. శ్రావణ మాసం ఆరంభమైన నేపథ్యంలో, హర్ హర్ శంభు అంటూ శివుడిపై భక్తిగీతం పాడిన నేపథ్యంలో, ఫర్మానీ నాజ్ పలు ముస్లిం సంఘాల నుంచి వ్యతిరేకత ఎదుర్కొంటోంది. మహిళలు పాడడం, డ్యాన్స్ చేయడం ఇస్లాంకు వ్యతిరేకమని దేవబంద్ ఉలేమా మౌలానా అసద్ ఖాస్మీ స్పష్టం చేశారు. ఇది దైవ విరుద్ధమని పేర్కొన్నారు. ఫర్మానీ నాజ్ తన చర్యలతో ముస్లింల మనోభావాల పట్ల అవమానకరంగా వ్యవహరించిందని, ఆమె అల్లాకు క్షమాపణలు చెప్పాలని అసద్ ఖాస్మీ డిమాండ్ చేశారు.
అయితే, రాజ్యాంగం ప్రకారం ఇతర మతాల సెంటిమెంట్లను దెబ్బతీయకుండా, తన మతాన్ని తాను అనుసరించుకోవచ్చని, దాని ప్రకారం నాజ్ విషయంలో ఎలాంటి సమస్యలేదని ముఫ్తీ జుల్ఫికర్ అనే ముస్లిం ప్రముఖుడు అభిప్రాయపడ్డారు.
తన పట్ల విమర్శలు వస్తున్న నేపథ్యంలో, ఫర్మానీ నాజ్ స్పందించారు. తనను తప్పుబట్టడం ఇక ఆపాలని హితవు పలికారు. కళాకారులకు మతాన్ని ఆపాదించవద్దని సూచించారు. తాను ముస్లిం సంప్రదాయాల ప్రకారం ఖవ్వాలీ కూడా పాడతానని అన్నారు. పాడేటప్పుడు తాను ఇలాంటివి పట్టించుకోనని స్పష్టం చేశారు.