Telangana: ఇంజినీరింగ్ విద్యకు ఈ ఏడాది పాత ఫీజులే అమలు... తెలంగాణ సర్కారు కీలక నిర్ణయం
- ఇంజినీరింగ్ ఫీజులను పెంచాలని ఇదివరకే నిర్ణయించిన కమిటీ
- కరోనా నేపథ్యంలో చితికిన ఆర్థిక పరిస్థితులపై తాజాగా దృష్టి
- సోమవారం నాటి భేటీలో తాజా పరిస్థితిపై సుదీర్ఘ చర్చ
- ఫీజులు పెంచవద్దని కీలక నిర్ణయం తీసుకున్న కమిటీ
కరోనా వైరస్ విజృంభణ, చితికిపోయిన ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో ఇంజినీరింగ్ విద్యను అభ్యసించే విద్యార్థులకు భారీ ఊరటను ఇస్తూ తెలంగాణ ప్రభుత్వం సోమవారం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది ఇంజినీరింగ్ కోర్సులకు పాత ఫీజులనే అమలు చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రవేశాలు, ఫీజుల నియంత్రణ కమిటీ (టీఎస్ఏఎఫ్ఆర్సీ) నిర్ణయించింది.
వాస్తవానికి ఈ ఏడాది రాష్ట్రంలో ఇంజినీరింగ్ విద్యకు సంబంధించిన ఫీజులను పెంచే దిశగా కమిటీ ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. ఆయా కళాశాలలు కూడా తమ నిర్వహణ ఖర్చులు పెరుగుతున్న దృష్ట్యా ఫీజులను పెంచాల్సిందేనని కమిటీని కోరాయి. అయితే కరోనా నేపథ్యంలో కుటుంబాల ఆర్థిక పరిస్థితి ఛిన్నాభిన్నం అయిన పరిస్థితులపై సోమవారం నాటి సమావేశంలో కమిటీ ప్రత్యేక దృష్టి సారించింది. సుదీర్ఘ చర్చల అనంతరం ఈ ఏడాది ఇంజినీరింగ్ విద్యకు పాత ఫీజులనే కొనసాగించాలని కమిటీ నిర్ణయించింది. ఫలితంగా గతేడాది వసూలు చేసిన ఫీజులనే ఆయా కళాశాలలు ఈ ఏడాది కూడా వసూలు చేయనున్నాయి.