Zoish Irani: స్మృతి ఇరానీ కుమార్తెకు క్లీన్ చిట్ ఇచ్చిన ఢిల్లీ హైకోర్టు
- జోయిష్ ఇరానీకి గోవాలో బార్ ఉందంటూ కాంగ్రెస్ ఆరోపణ
- కాంగ్రెస్ నేతలపై పరువునష్టం దావా వేసిన స్మృతి ఇరానీ
- కీలక వ్యాఖ్యలు చేసిన ఢిల్లీ హైకోర్టు
కేంద్రమంత్రి స్మృతి ఇరానీ కుమార్తె జోయిష్ ఇరానీకి గోవాలో బార్ అండ్ రెస్టారెంట్ ఉందంటూ కాంగ్రెస్ నేతలు తీవ్ర విమర్శలు చేయడం తెలిసిందే. అయితే, గోవాలో స్మృతి ఇరానీ పేరు మీద కానీ, ఆమె కుమార్తె జోయిష్ ఇరానీ పేరు మీద కానీ ఎలాంటి బార్ అండ్ రెస్టారెంట్ ఉన్నట్టు రికార్డుల్లో లేదని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. గోవాలో బార్ కు వారు యాజమానులు అనేందుకు ఎలాంటి ఆధారాలు లేవని పేర్కొంది. జోయిష్ ఇరానీ ఫుడ్ అండ్ బేవరేజెస్ లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకున్న దాఖలాలు కూడా లేవని వెల్లడించింది.
అంతేకాదు, స్మృతి ఇరానీ, ఆమె కుమార్తెపై కాంగ్రెస్ నేతలు జైరాం రమేశ్, పవన్ ఖేరా, నెట్టా డిసౌజా తదితరులు తప్పుడు ఆరోపణలతో కుట్రపూరితంగా వ్యక్తిగత దాడులు చేసినట్టు అర్థమవుతోందని హైకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది.
ఆ ముగ్గురు కాంగ్రెస్ నేతల ప్రకటన కూడా ఏదో అపవాదు మోపుతున్నట్టుగానే కనిపిస్తోందని, హానికరమైన ఉద్దేశాలతోనే వారు ఆ వ్యాఖ్యలు చేసి ఉంటారన్న అభిప్రాయం కలుగుతోందని వివరించింది. కేంద్రమంత్రి స్మృతి ఇరానీ పరువుప్రతిష్ఠలను దెబ్బతీయాలన్న లక్ష్యంతోనే ఈ ఆరోపణలు చేశారని భావిస్తున్నామని వెల్లడించింది. ఆ ముగ్గురు కాంగ్రెస్ నేతలకు వ్యతిరేకంగా స్మృతి ఇరానీ దాఖలు చేసిన పరువునష్టం దావాపై విచారణ సందర్భంగా ఢిల్లీ హైకోర్టు పైవ్యాఖ్యలు చేసింది.
కాగా, స్మృతి ఇరానీ పరువునష్టం దావా నేపథ్యంలో న్యాయస్థానం జైరాం రమేశ్, పవన్ ఖేరా, నెట్టా డిసౌజాలకు సమన్లు పంపింది. ట్విట్టర్ లో చేసిన అనుచిత వ్యాఖ్యలను తొలగించాలని ఆదేశించింది.