Telangana: తెలంగాణలో రేపు భారీ వర్షాలు.. హెచ్చరించిన వాతావరణశాఖ
- ఉపరితల ద్రోణికి తోడు ఉపరితల ఆవర్తనం
- నేడు ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయన్న వాతావరణశాఖ
- నిజామాబాద్లో గత నెలలో రికార్డుస్థాయిలో వర్షపాతం
తెలంగాణలో నేడు ఓ మోస్తరుగా వర్షాలు కురుస్తాయని, రేపు (బుధవారం) మాత్రం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఉత్తర, దక్షిణ భారత ప్రాంతాల మధ్య 900 మీటర్ల ఎత్తున గాలులతో కూడిన ఉపరితల ద్రోణి ఏర్పడి చత్తీస్గఢ్ నుంచి తెలంగాణ మీదుగా శ్రీలంక సమీపంలోని కొమరిన్ ప్రాంతం వరకు విస్తరించినట్టు తెలిపింది. దీనికి తోడు తమిళనాడుపై 1500 మీటర్ల ఎత్తున గాలులతో కూడిన ఉపరితల ఆవర్తనం ఏర్పడినట్టు పేర్కొంది. వీటి ప్రభావంతోనే వర్షాలు విస్తారంగా కురుస్తాయని తెలిపింది.
రాష్ట్రవ్యాప్తంగా నిన్న కూడా వర్షాలు కురిశాయి. అత్యధికంగా వికారాబాద్ జిల్లాలోని బంట్వారంలో 9.3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. జనగామ జిల్లాలోని అబ్దుల్ నాగారంలో అత్యల్పంగా 6.3 సెంటీమీటర్ల వర్షం కురిసింది. గత నెలలో తెలంగాణలో రికార్డుస్థాయిలో వర్షపాతం నమోదైంది. నిజామాబాద్ జిల్లాలో సాధారణ వర్షపాతానికి (252.6 మిల్లీ మీటర్లు) మించి 300 శాతం అదనపు వర్షపాతం (1011.2 మిల్లీ మీటర్లు) నమోదైనట్టు వాతావరణశాఖ తెలిపింది. జులై నెలలో ఈ స్థాయిలో వర్షాలు పడడం చాలా అరుదని పేర్కొంది.