Telangana: కేసీఆర్కు ఏటీఎంలా కాళేశ్వరం ప్రాజెక్టు: కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్
- యాదాద్రి నుంచి బండి సంజయ్ మూడో దశ పాదయాత్ర ప్రారంభం
- యాత్రను ప్రారంభించిన షెకావత్, కిషన్ రెడ్డి
- టీఆర్ఎస్ పాలనలో అవినీతి తారస్థాయికి చేరిందన్న షెకావత్
- కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్లే తప్పు అన్న కేంద్ర మంత్రి
కేంద్ర జల శక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తెలంగాణ సీఎం కేసీఆర్పై సంచలన ఆరోపణలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్కు ఏటీఎంగా మారిపోయిందని ఆయన విమర్శించారు. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన మూడో దశ ప్రజా సంగ్రామ యాత్ర మంగళవారం యాదగిరి గుట్ట నుంచి ప్రారంభమైంది. ఈ సందర్భంగా యాదాద్రిలో ఏర్పాటు చేసిన బీజేపీ బహిరంగ సభకు కేంద్ర మంత్రులు షెకావత్, కిషన్ రెడ్డి హాజరయ్యారు.
ఈ సందర్భంగా గజేంద్ర సింగ్ షెకావత్ మాట్లాడుతూ... తెలంగాణ ప్రజల కల ఇంకా సాకారం కాలేదని పేర్కొన్నారు. కేసీఆర్ పాలనలో తెలంగాణలో అవినీతి తారస్థాయికి చేరిందని ఆయన విమర్శించారు. ఫలితంగా తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని ఆయన చెప్పారు. అసలు కాళేశ్వరం ప్రాజెక్టు డిజైనే సరికాదని కూడా ఆయన ఆరోపించారు. ఆ మార్పు బీజేపీతోనే మొదలవుతుందని షెకావత్ తెలిపారు. అనంతరం బండి సంజయ్ యాత్రను కిషన్ రెడ్డితో కలిసి షెకావత్ ప్రారంభించారు.