Jawahari: పేలుడు లేకుండానే జవహరి శరీరాన్ని ముక్కలు చేసిన అమెరికా హెల్ ఫైర్ క్షిపణులు!

Hellfire missiles killed Jawahari without any explosion

  • కాబూల్ లో అల్ జవహరి హతం
  • గురిచూసి కొట్టిన అమెరికా
  • ఓ డ్రోన్, రెండు హెల్ ఫైర్ క్షిపణులతో జవహరి చరిత్ర సమాప్తం
  • కత్తుల వంటి పదునైన వస్తువులు కలిగివున్న హెల్ ఫైర్ మిసైల్!

ఒసామా బిన్ లాడెన్ తర్వాత అల్ ఖైదా సారథ్య బాధ్యతలు చేపట్టిన అయిమాన్ అల్ జవహరిని కూడా అంతమొందించామని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటన చేయడం తెలిసిందే. అమెరికా గూడఛార సంస్థ సీఐఏ సహకారంతో జవహరిని అమెరికా సేనలు అత్యంత కచ్చితత్వంతో మట్టుబెట్టాయి. అమెరికా ఈ దాడిలో కేవలం ఒక డ్రోన్, రెండు హెల్ ఫైర్ ఆర్9ఎక్స్ క్షిపణులతో ప్రపంచంలోనే మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదనేతను కడతేర్చింది. 

కాగా, ఈ దాడిలో వినియోగించిన హెల్ ఫైర్ క్షిపణులు ఎలాంటి పేలుడు లేకుండానే పనిపూర్తిచేసినట్టు వెల్లడైంది. ఈ లైట్ వెయిట్ క్షిపణులకు వార్ హెడ్ తొలగించి, వాటిస్థానంలో కత్తుల వంటి పదునైన వస్తువులను అమర్చారు. కాబూల్ లోని తన నివాసంలో బాల్కనీలో ఉన్న జవహరిని గుర్తించగానే, డ్రోన్ నుంచి వెలువడిన హెల్ ఫైర్ క్షిపణులు ఒక్కదుటున దూసుకెళ్లి ఆయన శరీరాన్ని చీల్చివేశాయి. దాంతో అక్కడేమీ పేలుడు లేకుండానే ఆపరేషన్ పూర్తయింది. 

జవహరి నివాసంలో ఓ కిటికీ పగిలిపోవడం మినహా మరే నష్టం జరగలేదు. ఇంటి లోపలి భాగంలో ఉన్న ఆయన కుటుంబ సభ్యులకు ఎలాంటి హాని జరగలేదు.

కాగా, శత్రుభయంకర హెల్ ఫైర్ క్షిపణులను అమెరికా ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్లలో ఎక్కువగా వినియోగిస్తుంటుంది. మొదటిగా 2017లో అల్ ఖైదా అగ్రనేత అబు అల్ ఖాయిర్ అల్ మస్రీని అంతమొందించేందుకు ఉపయోగించింది. అల్ మస్రీ సిరియాలో ఓ కారులో వెళుతుండగా, హెల్ ఫైర్ క్షిపణులు ఆయనను కడతేర్చాయి. 

ఆయన ప్రయాణిస్తున్న కారుకు పైభాగంలో పెద్ద రంధ్రం ఉండడం అప్పట్లో ఫొటోల్లో దర్శనమిచ్చింది. కారు ముందు, వెనుక భాగాలు చెక్కుచెదరకుండా ఉండగా, కేవలం కారు టాప్ మాత్రమే, అది కూడా అల్ మస్రీ కూర్చున్న చోటే పైభాగంలో రంధ్రం ఉంది.  అమెరికా ఎంత కచ్చితత్వంతో ఈ సర్జికల్ దాడులు చేసిందో దీన్నిబట్టే అర్థం చేసుకోవచ్చు. 

మొదట్లో అమెరికా దాడులతో ప్రాణనష్టం అధికంగా ఉండడంతో కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. కాలక్రమంలో మిస్టరీ ఆయుధం 'ఫ్లయింగ్ జిన్సు' (జపాన్ కత్తి) లేదా 'నింజా బాంబ్' సాయంతో దాడులు చేస్తోంది. ఈ 'ఫ్లయింగ్ జిన్సు' ఎలాంటి లోహాన్నయినా కోసేస్తుంది. దీన్నే హెల్ ఫైర్ క్షిపణులకు అమర్చినట్టు భావిస్తున్నారు. ఎవరైనా ఉగ్రవాద నేతను హతమార్చాల్సి వచ్చినప్పుడు, చుట్టుపక్కల ఉండే పౌరులకు ప్రాణనష్టం కలగకుండా అమెరికా ఈ రహస్య ఆయుధాలను వినియోగిస్తున్నట్టు వెల్లడైంది. తాజాగా అల్ జవహరి విషయంలోనూ అమెరికా ఇదే ఫార్ములాను అనుసరించినట్టు తెలుస్తోంది.
.

  • Loading...

More Telugu News