West Indies: నేటి మూడో టీ20 మ్యాచ్ కూడా ఆలస్యమేనట... కారణాన్ని వెల్లడించిన విండీస్ క్రికెట్ బోర్డు
- వెస్టిండీస్ టూర్‌లో టీమిండియా
- 3 గంటలు ఆలస్యంగా ప్రారంభమైన రెండో టీ20 మ్యాచ్
- నేటి మూడో టీ20 మ్యాచ్ గంటన్నర ఆలస్యంగా ప్రారంభం కానున్న వైనం
- ఆటగాళ్లకు సరిపడ విశ్రాంతి ఇచ్చేందుకే ఆలస్యమన్న విండీస్ బోర్డు
వెస్టిండీస్ పర్యటనలో ఉన్న టీమిండియాకు నిన్నటి రెండో టీ20 మ్యాచ్‌లో ఓ వింత అనుభవం ఎదురైన సంగతి తెలిసిందే. ట్రినిడాడ్ నుంచి సెయింట్ కీట్స్‌కు ఆటగాళ్లు నిర్ణీత షెడ్యూల్ మేరకే చేరుకున్నా... వారి లగేజీ రావడంలో తీవ్ర జాప్యం జరిగింది. ఫలితంగా నిన్నటి రెండో టీ20 మ్యాచ్ ఏకంగా 3 గంటలు ఆలస్యంగా మొదలైంది. ఈ తరహా పరిస్థితి మంగళవారం నాటి మూడో టీ20కి కూడా ఎదురు కానుంది. నేటి రాత్రి షెడ్యూల్ ప్రకారం 8 గంటలకు మొదలు కావాల్సిన మూడో టీ20 మ్యాచ్ గంటన్నర ఆలస్యంగా 9.30 గంటలకు మొదలు కానున్నట్లు విండీస్ క్రికెట్ బోర్డు అధికారికంగా ప్రకటించింది.
నేటి మ్యాచ్ ఆలస్యంగా ప్రారంభం కావడానికి గల కారణాన్ని కూడా విండీస్ బోర్డు వెల్లడించింది. వరుసగా రెండు రోజుల్లో రెండు మ్యాచ్‌లు ఉన్న నేపథ్యంలో ఆటగాళ్లకు నిర్ణీత సమయం మేర విశ్రాంతి ఇచ్చేందుకే నేటీ మూడో టీ20ని గంటన్నర ఆలస్యంగా ప్రారంభించనున్నట్లు బోర్డు అధికారులు ప్రకటించారు. సోమవారం నాటి మ్యాచ్ 3 గంటలు ఆలస్యంగా మొదలైన నేపథ్యంలో వారికి సరిపడ విశ్రాంతిని ఇచ్చేందుకు నేటి మూడో టీ20 మ్యాచ్‌ను గంటన్నర ఆలస్యంగా ప్రారంభిస్తున్నట్లు వారు తెలిపారు. ఐదు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లో ఇప్పటికే రెండు మ్యాచ్‌లు పూర్తి కాగా ఇరు జట్లు ఒక్కో గెలుపుతో సరిసమానంగా ఉన్నాయి.