India: కామన్వెల్త్ క్రీడల టేబుల్ టెన్నిస్ ఈవెంట్లో పసిడి మనదే!

India Mens TT team win gold in Commonwealth Games

  • ఫైనల్లో సింగపూర్ పై 3-1తో విజయం
  • శరత్ కమల్ ఓడినా, జ్ఞానశేఖరన్, దేశాయ్ అద్భుత విజయాలు
  • ఐదుకి పెరిగిన భారత్ స్వర్ణాలు
  • గత కామన్వెల్త్ పోటీల్లోనూ భారత టీటీ బృందానికి స్వర్ణం

కామన్వెల్త్ క్రీడల టేబుల్ టెన్నిస్ ఈవెంట్లో భారత్ అదరగొట్టింది. శరత్ కమల్, సత్యన్ జ్ఞానశేఖరన్, హర్మీత్ దేశాయ్, సనీల్ శెట్టిలతో కూడిన భారత పురుషుల టీటీ జట్టు అద్భుత ప్రదర్శనతో స్వర్ణం చేజిక్కించుకుంది. ఫైనల్లో సింగపూర్ పై భారత టీటీ బృందం 3-1తో గెలుపొందింది. 

తొలుత జ్ఞానశేఖరన్-హర్మీత్ దేశాయ్ లతో కూడిన డబుల్స్ జట్టు సింగపూర్ జోడీని ఓడించి 1-0తో భారత్ ను ఆధిక్యంలో నిలిపింది. అయితే, అనుభవజ్ఞుడైన శరత్ కమల్ సింగిల్స్ మ్యాచ్ లో ఓడిపోవడంతో 1-1తో సమం అయింది. అనంతరం జ్ఞానశేఖరన్, హర్మీత్ దేశాయ్ సింగిల్స్ మ్యాచ్ లలో గెలవడంతో భారత్ కు పసిడి ఖాయమైంది. మొత్తమ్మీద ఇవాళ్టి పోరులో సత్యన్ జ్ఞానశేఖరన్ కీలకపాత్ర పోషించాడు.

భారత పురుషుల టీటీ జట్టు గత కామన్వెల్త్ క్రీడల్లోనూ స్వర్ణం గెలుచుకున్న సంగతి తెలిసిందే. తాజా స్వర్ణంతో బర్మింగ్ హామ్ క్రీడల్లో భారత్ స్వర్ణాల సంఖ్య ఐదుకి పెరిగింది. 

కాగా, టేబుల్ టెన్నిస్ ఈవెంట్లో స్వర్ణ పతకం సాధించిన భారత పురుషుల టీటీ జట్టును రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అభినందించారు. అసాధారణ నైపుణ్యం, పట్టుదల ప్రదర్శించారని కొనియాడారు.

ప్రధాని నరేంద్ర మోదీ స్పందిస్తూ, ఇది గొప్ప శుభవార్త అని పేర్కొన్నారు. మున్ముందు కూడా ఇదే రీతిలో ఆడి విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.

  • Loading...

More Telugu News