Telangana: కాంగ్రెస్ అవ‌కాశాలు ఇవ్వ‌కుంటే... బ్రాందీ షాపుల్లో ప‌నిచేయ‌డానికీ ప‌నికి రారు: రేవంత్ రెడ్డి ఫైర్

tpcc chief revanth reddy fires on komatireddy rajagopal reddy

  • త‌ల్లి లాంటి పార్టీకి ద్రోహం చేశార‌న్న రేవంత్‌
  • అమిత్ షాతో భేటీతోనే కాంగ్రెస్‌తో రాజ‌గోపాల్ రెడ్డికి పేగు బంధం తెగింద‌ని వ్యాఖ్య‌
  • ఈడీ అంటే బీజేపీ ఎల‌క్ష‌న్ డిపార్ట్‌మెంట్ అన్న టీపీసీసీ చీఫ్‌
  • ఉప ఎన్నిక‌ల్లో ఎవ‌రు అడ్డు వ‌చ్చినా తొక్కుకుంటూ వెళ‌తామ‌ని ప్ర‌క‌ట‌న‌

కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన న‌ల్ల‌గొండ జిల్లా మునుగోడు ఎమ్మెల్యే కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డిపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి విరుచుకుప‌డ్డారు. కాంగ్రెస్ పార్టీతో పాటు మునుగోడు ఎమ్మెల్యే ప‌ద‌వికి కూడా రాజీనామా చేస్తూ కోమ‌టిరెడ్డి ప్ర‌క‌ట‌న చేసిన కాసేప‌టికే మీడియా ముందుకు వ‌చ్చిన రేవంత్ రెడ్డి... రాజ‌గోపాల్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విరుచుకుప‌డ్డారు. 

కాంగ్రెస్ పార్టీ అవ‌కాశాలు ఇవ్వ‌కుంటే... మీరు బ్రాందీ షాపుల్లో ప‌నిచేయ‌డానికి కూడా ప‌నికి రారంటూ రేవంత్ ఘాటు వ్యాఖ్య‌లు చేశారు. రాజ‌గోపాల్ రెడ్డి పార్టీని వీడినా ఆయ‌న సోద‌రుడు, భువ‌న‌గిరి ఎంపీ కోమ‌టిరెడ్డి వెంక‌ట రెడ్డి కాంగ్రెస్‌లోనే కొన‌సాగుతార‌ని రేవంత్ రెడ్డి చెప్పారు.

ఓ వైపు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్(ఈడీ) అధికారులు విచారిస్తుంటే... మ‌రోవైపు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో రాజ‌గోపాల్ రెడ్డి భేటీ అయ్యార‌ని రేవంత్ రెడ్డి ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. సోనియాను ఈడీ వేధిస్తుంటే... శ‌త్రువుతో భేటీ అవుతారా? అని ఆయ‌న మండిప‌డ్డారు. 

ఎప్పుడైతే అమిత్ షాతో భేటీ అయ్యారో.. అప్పుడే రాజ‌గోపాల్ రెడ్డికి కాంగ్రెస్‌తో పేగు బంధం తెగిపోయింద‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు. బీజేపీ విసిరే ఎంగిలి మెతుకుల‌కే కొంద‌రు ఆశ‌ప‌డుతున్నార‌ని రేవంత్ ప‌రోక్ష వ్యాఖ్య‌లు చేశారు. కాంట్రాక్టుల కోస‌మే రాజ‌గోపాల్ రెడ్డి బీజేపీకి చేరువవుతున్నార‌ని కూడా రేవంత్ ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీకి న‌ష్టం చేయాల‌ని చూస్తే స‌హించేది లేద‌ని కూడా ఆయ‌న హెచ్చ‌రించారు.

తెలంగాణ‌ను ఇచ్చిన త‌ల్లి సోనియా అయితే... ప్ర‌త్యేక రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని వీడిన రాజ‌గోపాల్ రెడ్డి త‌ల్లికి ద్రోహం చేశార‌ని రేవంత్ ధ్వ‌జ‌మెత్తారు. ఆర్థిక లావాదేవీల కోసం క‌న్న‌త‌ల్లి లాంటి పార్టీని వీడార‌ని కూడా ఆయ‌న ఆరోపించారు. ఈడీ అంటే ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్ కాద‌న్న రేవంత్‌... బీజేపీకి అనుకూలంగా ప‌నిచేసే ఎల‌క్ష‌న్ డిపార్ట్ మెంట్ అని ఆరోపించారు. 

కాంగ్రెస్ నేత‌ల‌ను వేధించేందుకే ఈడీని బీజేపీ వినియోగిస్తోంద‌న్నారు. మునుగోడు ఉప ఎన్నిక‌ను కాంగ్రెస్ పార్టీ ప్ర‌తిష్ఠాత్మ‌కంగా తీసుకుంటుంద‌ని రేవంత్ రెడ్డి ప్ర‌క‌టించారు. అందుకోసం ఎన్నిక‌ల క‌మిటీ కూడా సిద్ధంగా ఉంద‌ని తెలిపారు. ఉప ఎన్నిక‌లో ఎవ‌రు అడ్డు వ‌చ్చినా తొక్కుకుంటూ వెళ‌తామ‌ని రేవంత్ చెప్పారు.

  • Loading...

More Telugu News