Afra: అరుదైన జబ్బుతో బాధపడుతున్న సోదరుడి కోసం రూ.46 కోట్లు సేకరించిన బాలిక ఇకలేదు!
- కేరళకు చెందిన 16 ఏళ్ల ఆఫ్రా కన్నుమూత
- బాలికను కబళించిన స్పైనల్ మస్క్యులర్ అట్రోపీ
- ఆమె తమ్ముడికీ అదే వ్యాధి
- ఒక ఇంజెక్షన్ ఖరీదు రూ.18 కోట్లు
కేరళకు చెందిన 16 ఏళ్ల ఆఫ్రా ఓ అరుదైన జబ్బుతో బాధపడుతూ కన్నుమూసింది. ఆమె చిన్నారి తమ్ముడు మహ్మద్ కూడా అదే అరుదైన జబ్బుతో బాధపడుతున్నాడు. వారు ఎదుర్కొంటున్న సమస్యను వైద్యపరిభాషలో స్పైనల్ మస్క్యులర్ అట్రోఫీ (ఎస్ఎమ్ఏ) అంటారు. ఇది కండరాలను తినేసే జబ్బు. ఈ వ్యాధికి చికిత్సలో భాగంగా ఇచ్చే జోల్జెన్ స్మా ఇంజెక్షన్ ఒక్క డోసు ఖరీదు రూ.18 కోట్లు.
ఈ నేపథ్యంలో, తన సోదరుడు మహ్మద్ ను ఆదుకోవాలంటూ ఆఫ్రా యావత్ ప్రపంచానికి ఇచ్చిన పిలుపుతో రూ.46 కోట్లు వసూలైంది. గత జూన్ లో ఆమె వీడియో వైరల్ అయింది. ప్రజలు విశేషంగా స్పందించి ఆర్థికసాయం చేశారు. తన కంటే ముందు తన తమ్ముడ్ని ఆదుకోవాలంటూ ఆమె ఇచ్చిన పిలుపుతో అనేకమంది పెద్దమనసుతో స్పందించారు. దాదాపు 7.7 లక్షలమంది డబ్బు పంపారు.
కానీ, విషాదం ఏమిటంటే, ఏ జబ్బుతో బాధపడుతున్న తన తమ్ముడి కోసం నిధులు సేకరించిందో, అదే జబ్బుతో ఆఫ్రా కన్నుమూసింది. ఎస్ఎమ్ఏ లక్షణాలు తీవ్రం కావడంతో తల్లిదండ్రులు ఆమెను కాపాడుకోలేకపోయారు.